telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

టీ20 సిరీస్‌లో పాక్ కెప్టెన్ కామెడీ రనౌట్‌‌… వీడియో వైరల్

Pak

తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్వయంగా పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కామెడీ రనౌట్‌‌ చేసి, ఔటైన తీరు నవ్వులు పూయిస్తోంది. లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ పేలవంగా 17.4 ఓవర్లలోనే 101 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (24: 30 బంతుల్లో 1×4), ఇప్తికర్ అహ్మద్ (25: 24 బంతుల్లో 2×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరుతో ఫర్వాలేదనిపించారు. నిలకడగా ఆడిన ఈ ఇద్దరూ 4వ వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు కానీ.. మ్యాచ్‌ పాకిస్థాన్‌ చేతుల్లోకి వస్తున్న దశలో సర్ఫరాజ్‌తో సమన్వయ లోపంతో ఇప్తికర్ రనౌటయ్యాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్ వేసిన ఉదాన బౌలింగ్‌లో బంతిని కవర్స్ దిశగా హిట్ చేసిన ఇప్తికర్.. సింగిల్ కోసం సర్ఫరాజ్‌ని పిలిచాడు. దీంతో.. స్పందించిన సర్ఫరాజ్.. బంతిని చూస్తూ వికెట్ కీపర్ ఎండ్‌వైపు పరుగెత్తాడు. కానీ.. ఫీల్డర్ శనక బంతిని డైవ్ చేస్తూ అందుకోవడంతో.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు వెళ్తున్న ఇప్తికర్.. మళ్లీ వెనక్కి మళ్లాడు. కానీ… అతడ్ని గమనించని సర్ఫరాజ్ అలానే ముందుకు వెళ్లిపోవడంతో.. ఇప్తికర్ రనౌటయ్యాడు. ఆ తర్వాత ఓ ఓవర్‌పాటు క్రీజులో నిలిచిన సర్ఫరాజ్.. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో స్పిన్నర్ హసరంగ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డయ్యాడు. వాస్తవానికి బంతి బ్యాట్‌కి అందకపోవడంతో సర్ఫరాజ్.. ఎక్కడ స్టంపౌట్ అవుతానో అని కంగారుపడి వెనక్కి రాబోయాడు. కానీ.. నేరుగా వెళ్లిన బంతి వికెట్లను గీరాటేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts