telugu navyamedia
సినిమా వార్తలు

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ఇండియన్ కమిటీ లో భగీరథ ..

భారత దేశం లో నిర్మించిన చిత్రాలలో ఒక చిత్రాన్ని ఎంపిక చేసి ఆస్కార్ అవార్డుల కోసం పంపిస్తారు . ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డు చిత్రాన్ని ఎంపిక చేసే జ్యూరీలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథ ఎంపికయ్యారు.  ది అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అమెరికా మరియు ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా సంయుక్తంగా ఈ అవార్డు ఎంపిక ను నిర్వహిస్తుంది. భగీరథ ను ఎంపిక చేసినట్టు ఫిలిం ఫెడరేషన్ సెక్రెటరీ జనరల్ సుప్రన్ సేన్ లెటర్ ద్వారా తెలిపారు . ఇప్పటికే రాష్ట్ర ,కేంద్ర స్థాయి అనేక కమిటీల్లో పనిచేసిన భగీరథ కు ఇది ప్రతిష్టాత్మకమైనది .

ఈ సందర్భగా భగీరథ సినిమా, సాహిత్య ప్రస్థానం ఎలా సాగిందో నవ్య పాఠకుల కోసం ఒక ప్రత్యేక కథనం:-

1956 మే 1వ తేదీన ప్రకాశం జిల్లా నాగండ్ల గ్రామం లో గుమ్మడిల్లి రామస్వామి , వెంకాయమ్మ దంపతులకు భగీరథ జన్మించాడు. చెరుకూరి పెద్ద సీతమ్మకు పిల్లలు లేకపోవడంతో భగీరథ ఆమె దగ్గర పెరిగాడు.ప్రాధమిక విద్య ను నాగండ్లలోను, ఉన్నత విద్యను పావులూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లోను పూర్తి చేసిన భగీరథ 1971లో ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చాడు .

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పి .వి .నరసింహారావు గారు తన భార్య పేరుతో నెలకొల్పిన శ్రీమతి సత్యమ్మ నరసింహారావు స్మారక కళాశాల లో చేరి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత ఏ .వి .కళాశాలలో బి .ఏ లో చేరి ఆర్ధిక ఇబ్బందులవల్ల మధ్యలోనే మానేశాడు. ఆ తరువాత చాలా సంవత్సరాలకు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బి .ఏ పాసయ్యాడు .

భగీరథకు తన స్వగ్రామం నాగండ్లలో వున్న గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం అలవాటు అయ్యింది. ఆ గ్రంథాలయాన్ని అప్పటి ప్రెసిడెంట్ రావిపూడి వేంకటాద్రి గారు ఏర్పాటు చేయించారు. పావులూరు హై స్కూల్ లో చదివే రోజుల్లోనే కథలు , కందపద్యాలు రాసి అప్పటి తెలుగు మాస్టారు యాచమనేని మాధవరావు గారి ప్రశంసలు అందుకున్నాడు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవాలనే కోరిక బలీయంగా ఉండేది .

హైదరాబాద్ వచ్చిన తరువాత అశోక్ నగర్ లోని నగర కేంద్ర గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు . ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తెలుగు ఉపాధ్యాయుడు ఆచార్య తిరుమల భగీరథ అంటే అభిమానంగా ఉండేవాడు . కవిత్వం వ్రాయడానికి ఆచార్య తిరుమల బాగా ప్రోత్సహించేవాడు .1971లో పోతుకూచి సాంబశివరావు సంపాదకత్వంలో వెలువడే ” విశ్వరచన ” అనే పత్రికలో భగీరథ వ్రాసిన తొలి వ్యాసం ప్రచురితమైంది. దీనికి “ప్రగతి మధ్య మనిషి ” అనే నవల బహుమతిగా వచ్చింది .

అక్కడ నుంచి భగీరథ అనేక పత్రికల్లో వ్రాయడం మొదలు పెట్టాడు . కథలు , వ్యాసాలు , కవిత్వం , నాటకాలు వ్రాసేవాడు .1974లో భగీరథ తన 18వ సంవత్సరంలో వ్రాసిన “ఆహుతి ” అన్న నాటకాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఎంపిక చేశారు . ఈ నాటకం 1975 జనవరి 15 మరియు 30న రెండు భాగాలుగా ప్రసారం అయ్యింది.


రచనే తన ఉనికి , ఊపిరి అనుకున్న భగీరథ “ఇండో నిప్పన్ బేరింగ్స్ “, మరియు “లక్ష్మి స్టార్చి ” అనే కంపెనీల్లో ఉద్యోగాలు అన్నయ్య కోటేశ్వరరావు ఇప్పించినా , అది తన లక్షణం , లక్ష్యం కాదని తేల్చి చెప్పి వాటిల్లో చేరలేదు . 1977 అక్టోబర్ లో చిక్కడపల్లి లో ఉన్న “వెండితెర “ కార్యాలయానికి వెళ్లి పబ్లిషర్ , సంపాదకుడు బి .ఏ .వి .శాండిల్య ను కలసి అప్పటివరకు వివిధ పత్రిల్లో ప్రచురితమైన ఆర్టికల్స్ చూపించారు. శాండిల్య గారు సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా వెంటనే చేరిపొమ్మన్నాడు .అలా భగీరథ తాను కోరుకున్న జర్నలిజం లోకి వచ్చాడు .


1979 అక్టోబర్ లో ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రికలో హైదరాబాద్ రిపోర్ట్ గా చేరాడు. ఇది భగీరథ జీవితాన్ని మలుపు తిప్పింది .1980 జూన్ 1వ తేదీన భగీరథ వ్రాసిన తొలి కవితా సంపుటి “మానవత ” కు మహాకవి శ్రీశ్రీ ముందు మాట వ్రాసి స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు .

అప్పటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు , నిర్మాత , దర్శకుడు యు .విశ్వేశ్వర రావు , జర్నలిస్టు సంఘ అధ్యక్షుడు జి .ఎస్ వరదాచారి, ఆచార్య తిరుమల అతిథులుగా పాల్గొన్నారు .భగీరథ సాహిత్య జీవితానికి “మానవత “గట్టి పునాది వేసింది .1979 నుంచి 1993 వరకు భగీరథ జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో పనిచేసి రాజీనామా చేశాడు .

1992లో దర్శకుడు రామగోపాల్ వర్మ “అంతం “సినిమా షూటింగ్ సందర్భంగా భగీరథను శ్రీలంక ఆహ్వానించాడు . వారం రోజులపాటు భగీరథ శ్రీలంకలో పర్యటించాడు . 1993లో ఏ .బి .కె ప్రసాద్ తో కలసి వార్త అన్న దిన పత్రిక తీసుకురావాలని ప్రయత్నం చేశాడు .

అయితే అప్పటి పరిస్థితులు నచ్చక రాజీనామా చేశాడు . 1993లో మిత్రులతో కలసి “సాయి కమ్యూనికేషన్స్ ” పేరుతో ఖైరతాబాద్ లో డి .టి .పి సెంటర్ ను ప్రారంభించాడు. 1995లో భగీరథ రచించిన “నజరానా ” అన్న టెలీ ఫిలిమ్ హైదరాబాద్ దూరదర్శన్ ద్వారా ప్రసారమైంది.. 1996లో అంజిరెడ్డి , ప్రసాద్ రెడ్డి తో కలసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సుమన్ , ఆమని , రవళితో “ప్రియమైన శ్రీవారు “అన్న సినిమా నిర్మించాడు .

1997లో “సాయి కమ్యూనికేషన్స్ ” నష్టాల్లో వున్నప్పుడు దానిని మూసివేసి మళ్ళీ జర్నలిజం లోకి రావాలనుకున్నప్పుడు అప్పటి ఆంధ్ర ప్రభ సంపాదకులు వాసుదేవ దీక్షితులు గారు భగీరధకు ఆంధ్ర ప్రభ దిన పత్రిక సినిమా పేజీ ఇంచార్జి గా అవకాశం ఇచ్చారు. ఆంధ్ర ప్రభలో ఉండగానే 1999వ సంవత్సరంలో 68 సంవత్సరాల తెలుగు సినిమా పై “మోహిని ” పేరుతో రెండు భాగాలతో అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు . 2003 వరకు ఆంధ్ర ప్రభ దిన పత్రిక, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసి మేనేజిమెంట్ మారగానే రాజీనామా చేశాడు.

1996లో “ప్రియమైన శ్రీవారు ” సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా 2005లో “సామాన్యుడు” 2007లో “స్వాగతం ” సినిమాలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశాడు . 2010లో భగీరథ రచించిన కథ తో “నజరానా ‘అన్న బాలల చిత్రం రూపొందింది . దీనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డు లభించింది .


2010లో డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం లో ఎమ్మె రెండవ సంవత్సరం చదివే విద్యార్థులకు కోసం తెలుగు సినిమాపై ఒక పాఠం రచించాడు . తెలుగు సినిమా గురించి విశ్వ విద్యాలయ స్థాయిలో ఒక పాఠం రావడం ఇదే మొదటిసారి. ఇదే విశ్వవిద్యాలయంలో బి . ఏ చదివిన భగీరథ ఎమ్మె విద్యార్థులకు పాఠం వ్రాయడం అరుదైన విషయం . 2014లో వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికా లోని హ్యూస్టన్ లో జరిగే 9వ తెలుగు సాహిత్య సదస్సు మరియు 50 సంవత్సరాల అమెరికా కథ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి భగీరధను ఆహ్వానించారు . అక్టోబర్ 25, 26 తేదీల్లో జరిగిన సదస్సులో భగీరథ ” మధ్య యుగాలనాటి దక్షిణ భారత దేశ చరిత్ర ” గురించి మాట్లాడారు. ఈ ప్రసంగం అక్కడివారికి ఎంతో స్ఫూర్తి నిచ్చింది . చిట్టెన్ రాజు గారు భగీరథ ను ఘనంగా సత్కరించారు.

2017లో భగీరథ 64వ జాతీయ సినిమా అవార్డుల కమిటీ సభ్యుడుగా పనిచేశారు .ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాతీయ కమిటీ . ఇక భగీరథ నాలుగు పర్యాయాలు నంది అవార్డుల కమిటీలలోను , అనేక ప్రైవేట్ అవార్డుల కమిటీల్లోనూ , ఒకసారి జాతీయ సినిమా అవార్డుల కమిటీ, దూరదర్శన్ స్క్రిప్ట్ మరియు స్క్రీనింగ్ కమిటీ , తెలుగు విశ్వవిద్యాలయం లో అవార్డు పుస్తకాల కమిటీ , సెన్సార్ కమిటీ సభ్యుడుగా రెండు పర్యాయాలు పనిచేశారు.

ఉత్తమ జర్నలిస్టుగా భగీరధకు రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు , వంశీ , కిన్నెర , సినీ గోయర్ ,ఢిల్లీ తెలుగు అకాడమీ, ఎన్ .టి .ఆర్ ట్రస్ట్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, అనేక ఇతర సాంస్కృతిక సంస్థల నుంచి ఇప్పటివరకు 18 అవార్డులు వచ్చాయి . హైదరాబాద్ నగరం , రాజధాని అమరావతి , పద్మశ్రీ డివిఎస్ రాజు, ఒకప్పటి కథానాయిక మధుబాల పై భగీరథ డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందించాడు. 

భగీరథ ఇప్పటివరకు మానవత, అంతం కాదిది ఆరంభం, నిత్య నూతన కథానాయకుడు ,జమునా తీరం, మహార్జాతకుడు,దసరా బుల్లోడు,మెట్టింటి గడప, సావేరి ,సీతమ్మ ,తెలుగు సినిమా ప్రగతి, ప్రజల మనిషి, అక్షరాంజలి ,భగీరథ పథం ,భారతమెరికా పుస్తకాలను రచించాడు .ప్రస్తుతం “నాగలాదేవి “,శ్రీకృష్ణదేవరాయల ప్రేమకథ ప్రింటింగ్ లో వుంది .

2007 సంవత్సరం నుంచి భగీరథ దక్షిణ భారత దేశ చరిత్ర, ముఖ్యంగా కాకతీయ , విజయనగర సామ్రాజ్యాలపై పరిశోధన చేస్తున్నాడు.  ఇప్పుడు ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యుడుగా భగీరథ ఎంపిక కావడం మా నవ్య మీడియాకు గర్వకారణం .

Related posts