telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

యోగా బామ్మ … మృతి..

yoga grand mother died

తన యోగా ప్రతిభతో యువతతో సైతం పోటీపడే బామ్మ నానమ్మాళ్(99) కన్నుమూశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో శనివారం మృతి చెందారు. కోయంబత్తూరుకు చెందిన నానమ్మాళ్ యోగా టీచర్ గా గుర్తింపు పొందారు. ఎంతో కష్టమైన యోగాసనాలను చాలా ఈజీగా చేస్తారు. ‘యోగా బామ్మ’గా పాపులర్ అయ్యారు. ఆదివారం(అక్టోబర్ 27,2019) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులు నానమ్మాళ్‌ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. నానమ్మాళ్ ఫిబ్రవరి 1920న జన్మించారు. పొల్లాచి దగ్గర జమీన్ కలియాపురం స్వస్థలం. గ్రామీణ వ్యవసాయదారుల కుటుంబం నుండి వచ్చారు. చిన్నతనం నుంచే యోగాసనాల్లో ఆరి తేరారు. పదేళ్ల వయసు నుంచే యోగాభ్యాసం చేయడం ప్రారంభించారు. తన తాతలు యోగా చేయడం చూసి మక్కువ పెంచుకున్నారు. ప్రతిరోజూ కనీసం ఒకసారైనా యోగా చేసేవారు. ఈమె దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో సుమారు 600 మంది ప్రస్తుతం యోగా ట్రైనర్లుగా ఉన్నారు. 50 రకాల ఆసనాలను అవలీలగా వేయడం ఈ బామ్మ స్పెషాలిటీ. ఎలాంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి.. దేశంలోనే ఓల్డెస్ట్ యోగా టీచర్ గా ఖ్యాతి గడించారు నానమ్మాళ్.

2019 లో నానమ్మాళ్‌ ప్రతిభను గుర్తిస్తూ పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. 2016 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి నుంచి నారీశక్తి పురస్కార్ ను కూడా అందుకున్నారు. 2017లో కర్నాటక ప్రభుత్వం ఇచ్చే యోగా రత్న అవార్డు దక్కింది. కోయంబత్తూరులో 20వేల మంది విద్యార్థులు, ఔత్సాహికులకు యోగా నేర్పించడం ద్వారా నానమ్మాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. బామ్మ దగ్గర యోగా శిక్షణ తీసుకున్న వారు సింగపూర్, మలేషియా, లండన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో యోగా ట్రైనర్లుగా ఉన్నారు. బామ్మకు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు బాలక్రిష్ణన్. 1971లో గణపతి ప్రాంతంలోని భారతీ నగర్ లో ఓజోన్ పేరుతో యోగా సెంటర్ ని నెలకొల్పారు. యోగా సెంటర్ లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు.

Related posts