చిలీ రాజధాని శాంటియాగో వీదులు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. బలగాలు, నిరసనకారుల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. హింసాత్మక ఘటనల్లో19 మంది చనిపోయారు. దీంతో ఎమెర్జెన్సీ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. దక్షిణ అమెరికాలో పైనుంచి కిందకు సన్నటి చీలికలా ఉండే దేశం చిలీ. స్పానిష్ వలస రాజ్యంగా ఉండే ఈ ప్రాంతం చాలా రిచ్. అలాంటి దేశం ఈ రోజున భగభగ మండుతోంది. డాలర్‌తో పెసో మారకం దారుణంగా పడిపోవడంతో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైంది. దానికితోడు ప్రజా రవాణాని ప్రభుత్వం ఖరీదైనదిగా మార్చేసింది. జనం గగ్గోలు పెడుతూ వీధుల్లోకి రావడంతో అల్లర్లకు దారి తీసింది. టైర్లను కాల్చివేస్తూ నిరసన తెలిపారు. వాహనాలను అడ్డుకున్నారు. బలవంతంగా దుకాణాలను మూసివేయించారు. పలు షోరూమ్‌లకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. ఏ దేశంలోనైనా సామాన్యుడు బతకలేని పరిస్థితులే గొడవలకు కారణమవుతాయి. ప్రస్తుతం లాటిన్ అమెరికాలోని చిలీలోనూ ఇదే పరిస్థితి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోంది. అసలే దేశంలో అన్నింటి ధరలూ విపరీతంగా పెరగిపోయి, బతకలేని విధంగా ఉంది. పుండు మీద కారం చల్లినట్లు మెట్రో రైలు చార్జీలను సర్కార్ పెంచేసింది. దీంతో చిలీ జనాలు రెచ్చిపోతున్నారు. వారం రోజులుగా అక్కడ జనం వీధుల్లోకి వచ్చి హింసకు దిగారు.
ఆందోళనకారులపై రంగంలోకి దిగిన ఆర్మీ.. ఉక్కుపాదం మోపింది. లాఠీ ఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అల్లర్లలో మృతుల సంఖ్య 19కు చేరింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో… అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అదనపు బలగాలను రంగంలోకి దింపింది. దీంతో శాంటియాగోలోని విధులన్నీ బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. షాపింగ్ మాల్స్ తెరుచుకోలేదు. ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటించారు. నిరసనలపై ఆంక్షలు విధించింది. అసలే ఆర్థిక అసమానతలు. పైగా లివింగ్ కాస్టు ఎక్కువే. ఆర్థిక ఇబ్బందులతో జనం ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. మెట్రోతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఛార్జీలను అమాంతం పెంచేసింది. దీంతో జనం రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడుతుండటంతో శాంటియాగో వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి.
టీడీపీ అంటే నాకెప్పుడూ గౌరవం ఉంటుంది: సుజనా చౌదరి