telugu navyamedia
క్రీడలు

రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై WFI తాత్కాలిక నిషేధం

టోక్యో ఒలింపిక్స్‌లో అనుచిత ప్రవర్తన కారణంగా భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ వినేశ్‌ పొగాట్‌పై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) తాత్కాలిక నిషేధం విధించింది. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందని భావించినప్పటికి వినేశ్‌ నిరాశ పరిచింది. 53 కేజీల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వినేశ్ క్వార్టర్‌ ఫైనల్లో బెలారస్‌కు చెందిన వెనెసా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్‌ ముందు వినేశ్‌ శిక్షణ కోసం హంగేరీ వెళ్లింది. అక్కడి నుంచి టో​క్యోకు వచ్చింది. అప్పటికే ఆమెకు ఒలింపిక్స్‌ విలేజ్‌లో కేటాయించిన గదిలో తన తోటి రెజ్లర్లు అన్షు మాలిక్‌, సోనమ్‌ మాలిక్‌, సీమా బిస్లాతో కలిసి ఉండడానికి నిరాకరించిందని ఆరోపణలు వచ్చాయి. తాను హంగేరీ నుంచి వచ్చానని వారు నేరుగా భారత్‌ నుంచి రావడంతో వారినుంచి కరోనా సోకే అవకాశం ఉందని వారితో కలిసి ఉండలేనని వాదించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారితో కలిసి ప్రాక్టీస్‌ చేయలేదని అలాగే రెజ్లింగ్‌లో పాల్గొనేటప్పుడు స్పాన్సర్‌ కిట్లను కూడా ధరించలేదని అధికారులు వివరించారు.

టోక్యోలో నెలకొన్న వివాదంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి తమకు నోటీసులు వచ్చాయని అథ్లెట్లను అదుపులో పెట్టుకోలేరా అని తీవ్రంగా స్పందించారని సంబంధిత అధికారి మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎఫ్‌ఐ వినేశ్‌ ఇండియాకు రాగానే ఆమెకు నోటీసులు జారీ చేసి తాత్కాలిక నిషేధం విధించింది. కాగా డబ్ల్యూఎఫ్‌ఐ ఈ నెల 16 వరకు ఆమెకు గడువు ఇచ్చి వివరణ కోరింది. వినేశ్‌ సమాధానంలో స్పష్టత లేకపోతే ఆమెపై ధీర్ఘకాల నిషేధం విధించే అవకాశం ఉందని డబ్ల్యూఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts