ప్రపంచ కప్ లో భాగంగా మాంచెస్టర్ లో వెస్టిండీస్ పై టీమిండియా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 269 పరుగుల లక్ష్యఛేదనలో కరీబియన్లు 34.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలవుట్ అయ్యారు. గేల్ సహా టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో విండీస్ కు పరాభవం తప్పలేదు.
మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, చహల్, కుల్దీప్, పాండ్య విండీస్ బ్యాటింగ్ లైనప్ ను కట్టుదిట్టం చేశారు. ఆ జట్టులో ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ సాధించిన 31 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు, బుమ్రా, చహాల్ రెండేసి వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో టీమిండియా సెమీస్ ముంగిట నిలిచింది. బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.