తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తో కలిసి నడుస్తానని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అన్నారు.
జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి, వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తప్పులు జరుగుతాయని, తమ హయాంలో కూడా జరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని తెలిపారు. ఈ విషయాన్నిజగన్ దృష్టికి తీసుకెళ్లానని, వాటిని సరిచేస్తానని తనకు చెప్పారని తెలిపారు.