telugu navyamedia
సినిమా వార్తలు

‘కొండపొలం’ ఎలా ఉందంటే..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 8న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండ పొలం అనే నవల ఆదరంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. విజ‌య‌వంత‌మైన ‘ఉప్పెన‌’ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన చిత్రం కావ‌డం.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌డం వల్ల సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుద‌ల‌ అయ్యింది.

ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఓ యువకుడు ఎంతో ఎత్తుకు ఎదగడమే కొండ పొలం కథ. ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన ఓ యువ‌కుడు. ఉద్యోగవేట‌లో హైద‌రాబాద్ చేరుకుంటాడు. నాలుగేళ్లు ప్ర‌య‌త్నించినా ఉద్యోగం రాదు. ఆత్మ‌విశ్వాస లోప‌మే త‌న‌కి శాపంగా మారుతుంది. ఎంత‌కీ ఉద్యోగం రాక‌పోవ‌డం వల్ల తిరిగి ఊరికి చేరుకుంటాడు. క‌రవు కాట‌కాల వ‌ల్ల తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌తాడు. అతడు అడవితో అడవిలాంటి అమ్మాయి ఓబులమ్మతో ప్రేమలో పడతాడు.

Kondapolam

క‌ట్‌చేస్తే.. ఆరం భంలో పిరికివాడిగా క‌నిపించిన క‌థానాయ‌కుడు.. అడ‌వితో మ‌మేక‌మైన‌కొద్దీ ధైర్య‌శాలిగా మారే క్ర‌మం, పులితో చేసే పోరాటం సినిమాకి హైలైట్‌. న‌వ‌ల వేరు, దాన్ని సినిమాగా మ‌ల‌చ‌డం వేరు. పుస్త‌కంలో ప్ర‌తిదీ డీటెయిల్డ్‌గా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ, సినిమాలో అన్ని సౌల‌భ్యాలు ఉండ‌వు. అక్క‌డే ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది. పుస్త‌కం స్థాయిలో ఉత్కంఠ, భావోద్వేగాలు ఈ సినిమాలో పండ‌క‌పోవ‌డం వల్ల అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి.

విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం వల్ల ఉత్కంఠ రేకెత్తించాల్సిన పోరాట ఘ‌ట్టాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి. న‌వ‌ల‌లో లేని ఓబులమ్మ పాత్ర సినిమాలో ఉంటుంది. ఆ పాత్ర ఆధారంగా అంత‌ర్లీనంగా ఓ ప్రేమ‌క‌థ‌ని జోడించారు ద‌ర్శ‌కుడు. ఆ ప్ర‌య‌త్నం సినిమాకి మేలే చేసింది. కొద్దిలో కొద్దిగా వాణిజ్యాంశాల్ని మేళ‌వించిన‌ట్టైంది. ఓబు-ర‌వీంద్ర నేప‌థ్యంలో ప‌తాక స‌న్నివేశాలు ఆసక్తిగా సాగాయి. సినిమాకు మాట‌లు, పాట‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

అడ‌వి వెళ్లాక ఆ యువ‌కుడికి అడ‌వి ఏం నేర్పింది? గొర్రెల్ని కొండ‌పొలానికి తీసుకెళ్లి వ‌చ్చాక అత‌నిలో వ‌చ్చిన మార్పేమిటి? యూపీఎస్సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మ‌విశ్వాసాన్ని ఎలా సంపాదించాడ‌నేది మిగ‌తా క‌థ‌.

Kondapolam

మంచి చదువు ఉండి కూడా ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక, గొర్రెల కాపరిగా మారిన యువకుడు రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు.రాయ‌ల‌సీమ యాస ప‌లికిన విధానం కూడా మెప్పిస్తుంది. పులితో చేసే పోరాట ఘ‌ట్టాల్లోనూ, క‌థానాయిక‌తో క‌లిసి చేసిన స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది.

ఇక, అదే సామాజిక వర్గం, వృత్తి కలిగిన అమ్మాయి ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ అద్భుత నటను కనబరిచింది. కొన్ని సన్నివేశాల్లో వైష్ణవ్‌ని డామినేట్‌ చేసిందనిపిస్తుంది. అడవికి వచ్చిన రవీంద్రలో పట్టుదల ఏర్పడటానికి పరోక్షంగా కారణమైన ఓబులమ్మ పాత్రకు న్యాయం చేసింది రకుల్‌. రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్‌ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్‌, హేమ, మహేశ్‌ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్ర‌లు కూడా హ‌త్తుకునేలా ఉంటాయి. 

ఇక సినిమాకి ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. ‘ఏ భాషలో మాట్లాడినా అది గుండెను చేరుతుంది. కానీ మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది’,‘అవతలి వాళ్ళ చెప్పులో కాలు పెడితే కానీ తెలియదు అందులో ఎన్ని ముళ్ళు ఉన్నాయో’,‘అడవికి చుట్టంచూపుగా వెళ్ళాలి అంతేకానీ చెట్లు నరకడం, జీవాలను చంపడం చేయకూడదు’లాంటి డైలాగ్స్‌ హృదయాన్ని తాకడంతో పాటు ఆలోచింప చేస్తాయి. కీరవాణి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదిరిపోయింది. ‘ర‌య్ ర‌య్ ర‌య్యారే’అంటూ తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు.

జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ శ్రవణ్ కటికనేని తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా కొండ పొలం పై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

 

Related posts