ప్రముఖ దర్శకుడు శంకర్ కొత్త చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్ విరామ సమయంలో శంకర్ కొత్త చిత్రానికి సంబంధించిన స్ర్కిప్టు సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో దక్షిణాదికి చెందిన నలుగురు స్టార్ హీరోలు నటించబోతున్నారట. కన్నడ హీరో యష్, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయి. వీరితో పాటు తెలుగు, మలయాళ హీరోలు కూడా ఈ చిత్రంలో నటించనున్నారట. ఈ చిత్రం వివరాలను త్వరలో శంకర్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. మరి తెలుగులో ఏ హీరోకు ఆ అవకాశం దక్కుతుందో వేచి చూడాలి. కాగా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి నేపథ్యంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో అవినీతిని సహించలేని సిటిజన్‌గా, లంచగొండితనానికి పరాకాష్ఠగా మారిన అధికారిగా రెండు పాత్రల్లోనూ కమల్‌హాసన్ నట విశ్వరూపం చూపించారు. దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో దీనికి సీక్వెల్ తీయాలని ఆలోచిస్తుండగా ఎట్టకేలకు గతేడాది ప్రాజెక్టు పట్టాలెక్కింది. శంకర్-నిర్మాత మధ్య గొడవలు, సెట్లో ప్రమాదం జరిగి టెక్నీషియన్లు చనిపోవడం, లాక్‌డౌన్ వంటి కారణాలో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా షూటింగ్ తిరిగి ప్రారంభించే సమయానికి బడ్జెట్ విషయంలో శంకర్, నిర్మాత మధ్య మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. దీంతో శంకర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
previous post