telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబుకు ఆ పది రోజుల్లో జయలలిత గురించి తెలిసిందేంటి ?

sobhan-babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఇంతకుముందు శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం ఎలా జరిగిందో చూశాము. ఇప్పుడు ఆ పరిచయం ఎలా ముందుకు సాగిందో చూద్దాము.

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

1973 జూలైలో… ఊటీ… “డాక్టర్ బాబు” చిత్రంలో జయలలితకూ, శోభన్ బాబుకూ షూటింగ్ సమయంలో పరిచయం జరిగింది. ఆ తరువాత ఎవరి హోటల్స్ కు వారు చేరుకున్నారు. స్నానం చేస్తున్నా… భోజనం చేస్తున్నా శోభన్ బాబుకు జయలలితే గుర్తుకురాసాగింది. ఆమె కాస్త మూడీగా కన్పించడం కూడా అందుకు కారణం. రెండవ రోజు షూటింగ్ ఉండడంతో జయలలిత గంట ముందుగానే లొకేషన్ కు చేరుకున్నారు. శోభన్ బాబు కారు దిగగానే జయలలితే ఎదురొచ్చి “గుడ్ మార్నింగ్” అన్నారు. “వెరీ గుడ్ మార్నింగ్… హౌ ఆర్ యూ టుడే…” అన్నారు శోభన్. “వెరీ ఫైన్…” నవ్వుతూ అన్నారు జయలలిత. “హౌ వర్ యూ ఎస్టర్ డే” నవ్వుకు నవ్వు కలుపుతూ అడిగారు శోభన్ బాబు. “ఫైన్” అనే సమాధానం వచ్చింది ఆమె నుంచి. “హౌ వర్ యూ డే బిఫోర్ ఎస్టర్ డే..?” అన్నారు శోభన్ బాబు నవ్విస్తూ కవ్విస్తూ. “నాట్ ఫైన్” మూతి ముడుచుకున్నారు జయలలిత. “వై నాట్” అడిగారు శోభన్ బాబు. “మీరే…” అన్నారు జయలలిత. “నేనా… రీజన్ చెప్పండి” అంటూ ఆమె ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నారు ఆశ్చర్యపోతూ శోభన్ బాబు.

Sobhan-babu-with-Jayalalitha-1

“చెప్పలేనంత దిగులుతో ఉన్న నన్ను మీ జోక్స్ తో నవ్వించి తేలిక చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ గా మారిపోయాను. అమ్మ పోయి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కానీ ఈ తీరని బాధ ఎన్నేళ్ళ నుంచో భరిస్తున్నట్టుగా ఉంది. అమ్మ అన్ని తానై అడగకుండానే అన్నీ చేసి పెట్టేది. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అమ్మే కారణం. అమ్మ లేకపోవడంతో ఉత్సాహం పోయింది. ఒక లక్ష్యమే లేకుండా పోయింది. ఏది ఎందుకు చేయాలో కూడా తెలీట్లేదు. అన్నీ ఉండి ఏమీ లేనిదానినయ్యాను. ఎవరన్నా ఉన్నామని చెప్పినా… వారు కేవలం డబ్బు కోసమే అని అర్థమైపోతుంది. ఆప్తులనుకున్న వాళ్ళు అమ్మ చనిపోగానే లక్షల మేరకు దోచుకుని వెళ్లిపోయారు. ఎవరిని నమ్మాలో అర్థం కాట్లేదు. ఈ ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకుని నా ఆస్తులు కాజేసి నన్ను బజారులో నిలబెడతారేమోనని భయంగా ఉంది. ఈ జీవితంలో ఒంటరిగా మిగిలిపోతానేమో అని కుమిలిపోతున్న నాకు మీ పరిచయంతో ప్రాణం లేచొచ్చింది. మా అమ్మలోని ఆత్మీయత మీలో కన్పిస్తోంది. అమ్మ ఉన్నప్పటి ధైర్యం… మీరు పక్కనుంటే వస్తుంది” అంటూ పొరలి వస్తున్న దుఃఖాన్ని కన్పించకుండా పక్కనే ఉన్న మేకప్ అద్దాన్ని ముఖానికి అడ్డంగా పెట్టుకుని టచప్ చేసుకుంటున్నట్లుగా నటించారు జయలలిత.

Jayalalitha

కాసేపు ఇద్దరూ మాట్లాడలేదు. ఇంకా ఆమె ముఖానికి అడ్డం అడ్డుగానే ఉంది. ఇంతలో డైరెక్టర్ లెనిన్ బాబు షాట్ కు రమ్మని కబురు చేశారు. శోభన్ బాబు వెళ్ళబోతూ మనసాగక జయలలితగారి కళ్ళలోకి తొంగి చూశారు. జయలలిత తెచ్చిపెట్టుకున్న నవ్వుతో “సారీ” అన్నారు. “మ్యారీ సమ్ హ్యారీ అండ్ త్రో అవే దిస్ సారీ ఇన్ ఎ లారీ” నవ్వుతూ సరదాగా అన్నారు శోభన్ బాబు. ఇంకేముంది అదివిన్న జయలలిత పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. దాంతో చేతిలో ఉన్న అద్దం జారిపడి ముక్కలయింది. ఈసారి శోభన్ బాబు “సారీ” అన్నారు. “డోంట్ క్యారీ దట్ సారీ అండ్ అవే దట్ సారీ ఇన్ ఎ లారీ” అంటూ నవ్వారు జయలలిత. అంతలో అక్కడికొచ్చిన దర్శకుడు లెనిన్ బాబు వీరిద్దరి నవ్వులను చూసి “ఆశ్చర్యంగా ఉందే… సాధారణంగా జయలలిత గారూ ఎవ్వరితోనూ మాట్లాడరు. షూటింగ్ లో గ్యాప్ వస్తే తనతో తెచ్చుకున్న ఇంగ్లీష్ నవలలను చదువుకుంటారు. రెండు రోజుల పరిచయానికే మీతో ఇంత చనువుగా ఉన్నారు” అంటూనే షాట్ వివరాలు చెప్పుకొచ్చారు.

Jayalalitha-and-sobhan-babu

దాదాపు పదిరోజులు ఊటిలోయల్లో షూటింగ్ జరిగింది. ఆ పదిరోజులూ ఇద్దరికీ పది గంటల్లా గడిచిపోయాయి. ఆ పదిరోజుల్లో జయలలితకు అపారమైన జ్ఞానం ఉందని, ఏదైనా ఒక్కసారి చదివినా ఇట్టే పట్టేయగలదని, సకల విద్యా పారంగతురాలని, ఎక్కువ చదువుతూ తక్కువ మాట్లాడే వ్యక్తి అని తెలుసుకున్నారు శోభన్ బాబు. అంతేకాదు ఆచితూచి మాట్లాడడం, ఇంగ్లీష్ లోని గొప్ప పుస్తకాలను చదవడం, మెరిసే ప్రపంచంలో ఉన్నా తరచూ వీలైనంత సాధారణంగా గడపడం ఇంకా ఆమెలో ఉన్న సుగుణాలెన్నో శోభన్ బాబుకు నచ్చాయి. మొత్తానికి ఊటీలో షూటింగ్ పూర్తయ్యింది. జయలలిత విమానంలో, శోభన్ బాబు ట్రైన్ లో మద్రాసు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts