telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

Sobhan-Babu-with-Jayalalitha

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి… “సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. ఈరోజు శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం ఎలా జరిగిందో చూద్దాం. శోభన్ బాబు, జయలలితపై ఎన్నో రూమర్లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ శోభన్ బాబుకు జయలలిత అంటే చాలా అభిమానం.

1972 చివర్లో “ఖైదీబాబాయ్” సినిమా అవుట్ డోర్ షూటింగ్ కోసమని మైసూరు వెళ్లారు శోభన్ బాబు. ఆరోజు షూటింగ్ ముగియడంతో హోటల్ రూమ్ కు వచ్చేశారు శోభన్ బాబు. పగలంతా పని చేసి, తరువాత స్నానం చేసి, పెందరాళే భోజనం చేసి, త్వరగా పడుకోవడం ఆయనకు అలవాటు. నిద్రపోయే ముందు ఏదైనా బొమ్మల పుస్తకం చూస్తూ చూస్తూ అలాగే నిద్రపోవడం కూడా పరిపాటే. అలా ఓ రోజు రాత్రి నిద్రపోవడానికి ఉపక్రమించిన శోభన్ బాబు “విజయచిత్ర” మ్యాగజైన్ తిరగేశారు. ఇక దాన్ని పక్కన పెట్టేద్దాం అనుకుంటూనే పక్క పేజీ తిప్పారు. అక్కడ సర్వాంగ సుందరంగా ఓ ఫుల్ పేజీ కలర్ ఫోటో దర్శనమిచ్చింది శోభన్ బాబుకు. ఆవిడే జయలలిత. అంతే అప్పటికే ముంచుకొస్తున్న నిద్ర ఒక్కసారిగా మాయమైపోయింది.

Jayalalitha

అప్పటికే శోభన్ బాబు హీరోగా నెలరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న “డాక్టర్ బాబు” చిత్రం నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తికి హీరోయిన్ దొరకట్లేదు. ఈ ఫోటో చూడగానే వెంటనే శోభన్ బాబుకు మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. వెంటనే మైసూరు నుంచి మద్రాసులో ఉన్న తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారికి ట్రంక్ కాల్ బుక్ చేశారు శోభన్ బాబు. ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు కాగానే “హీరోయిన్ గా ఎవరినైనా నిర్ణయించారా ?” అంటూ అసలు విషయానికొచ్చారు శోభన్ బాబు. “ఇంకా లేదు… పోనీ మీరు ఎవరినైనా సజెస్ట్ చేయండి” అన్నారు నిర్మాత. వెంటనే శోభన్ బాబు “మీ బడ్జెట్ ఓకే అయితే Sputnik Starని ఎందుకు అడిగి చూడకూడదు” అన్నారు. “అంటే ఎవరో…” అన్నారు నిర్మాత. “అదేనండీ… జయలలిత గారూ…” అన్నారు శోభన్ బాబు. “ఓ… మీ ఐడియా అద్భుతం… నాకు ఈ ఐడియా రాలేదు. ఇప్పుడే కనుక్కుని మీకు ఫోన్ చేస్తా…” అన్నారాయన.

Jayalalitha-and-sobhan-babu

ఆ రాత్రి శోభన్ బాబుకు నిద్ర పట్టలేదు. కళ్ళు తెరిచినా, మూసినా ఆ నాటి “సత్యభామ” వేషంలో కళ్ళముందు కదలాడుతోంది జయలలిత. ఆమెతో కలిసి నటించాలని 1965 అనే “వీరాభిమన్యు” విడుదలైన నుంచి… అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు శోభన్ బాబు. అంతలోనే శోభన్ బాబుకు ఓ సందేహం వచ్చింది. ఇంతకుముందులాగే జయలలిత తల్లిగారు మళ్ళీ అడ్డుపడతారా ?… ఆ సందేహం వచ్చిన మరుక్షణమే జయలలిత వాళ్ళ అమ్మగారు ఇటీవలే చనిపోయారు కదా అనే విషయం గుర్తొచ్చింది శోభన్ బాబుకు. అప్పటికే జయలలిత ముక్కోపి అని, గర్విష్ఠి అని, తొందరపాటు మనిషని, నిర్మొహమాటస్థురాలని ఆనోటా ఈ నోటా విన్నారు శోభన్ బాబు. ఆ ఆఫర్ ను ఆమె నిరాకరిస్తుందేమో… ఇలా ఆలోచిస్తూ శోభన్ బాబు నిద్రలోకి జారుకున్నారు.

ఆ మరునాడు రాత్రి కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ట్రంక్ కాల్ వచ్చింది. “కంగ్రాచ్యులేషన్స్ సర్… జయలలిత గారు ఒప్పుకున్నారు. సరైన సమయంలో మీరు మంచి సలహా ఇచ్చారు. థాంక్స్… మద్రాసు వచ్చాక మిమ్మల్ని కలుస్తాను” అంటూ పట్టలేని ఆనందంతో ఫోన్ పెట్టేశారు నిర్మాత. కానీ ఆయనకు తెలీదు… ఆయనకన్నా ఎక్కువగా, పట్టలేనంత ఆనందంగా ఉంది శోభన్ బాబు అని. జయలలిత గారితో షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడసాగారు శోభన్ బాబు. ఆరోజు రానే వచ్చింది.

Sobhan-babu-with-Jayalalitha-1

1973 జూలైలో… ఊటీ… “డాక్టర్ బాబు” చిత్రంలో జయలలితకూ, శోభన్ బాబుకూ కాంబినేషన్ సీన్స్, పాటల షూటింగ్. నిర్మాత తమ్మారెడ్డి గారు శోభన్ బాబును, జయలలితను ఒకరికొకరిని పరిచయం చేశారు. “హలో” అన్నారు జయలలిత. “డబుల్ హలో టూ యూ” అన్నారు శోభన్ బాబు. చిన్నగా నవ్వారు జయలలిత. “మీతో నటించడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు శోభన్ బాబు. “నాక్కూడా…” అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు జయలలిత. ఆరోజు షూటింగ్ మధ్యలో నాలుగైదు జోకులు పేల్చారు శోభన్ బాబు. ఆ జోకులకు జయలలిత పడిపడి పొట్ట చెక్కలయ్యేలా దాదాపు 10 నిమిషాలు నవ్వారు ఆమె… ఇలా ఆరోజు శోభన్ బాబుతో జయలలితకు మొదటిసారిగా పరిచయం జరిగింది.

Related posts