ఏపీలో నెలకొన్న ఇసుక కొరతపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇసుక సమస్యను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని నేను ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు. ఇసుక కొరత, ఏపీలో ఆంగ్లమాధ్యమం అంశాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారి డ్యూటీలు (విమర్శలు) వారు చేస్తున్నారన్నారు. అయితే, వైసీపీ ఈ సమస్యపై వివరణ ఇవ్వాలి. అంతేగానీ, విమర్శలు చేసే ప్రతిపక్షాలపై ఇంతలా ప్రతి విమర్శలు చేయకూడదన్నారు.
విమర్శించిన వారిని ఉద్దేశిస్తూ ఎంత మంది పెళ్లాలు? మట్టికొట్టుకుపోతావు అన్న మాటలు అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో 95 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలో విద్యకు మద్దతు తెలుపుతున్నారు. తెలుగును ఒక సబ్జెక్టుగా ఉంచి ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తే మంచిదే. అలాగే, ప్రైవేటు పాఠశాలల్లోనూ తెలుగును సబ్జెక్టుగా కొనసాగించాలి. ఆంగ్ల మాధ్యమంలో విద్యపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తప్పు లేదు’ అని తెలిపారు.