telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నసీఎం జగన్ దంపతులు..

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలువేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరయ్యారు.

తొలుత సీఎం వైఎస్ జగన్.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించి సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు.

దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్‌ నామ సంవత్సరం పేరుకు తగ్గట్లుగానే ఈ ఏడాది అన్నీ శుభాలే జరుగతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందని తెలిపారు.

ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తూ.. శుభకృత్‌కు తగ్గట్లే పాలన అందిస్తారని సీఎం జగన్‌ను ఆశీర్వదించారు సిద్ధాంతి. అనంతరం పంచాంగకర్తను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించగా.. శారదాపీఠం తరపున సీఎం జగన్‌కు వస్త్రాలు సిద్ధాంతి అందజేశారు .

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ద‌య‌, ప్ర‌జ‌లంద‌రి దీవెన‌లు వైసీపీ ప్ర‌భుత్వానికి ఇంకా బ‌లాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ ఏడాదంతా రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ  ఏడాది కూడా  ప్ర‌జ‌లంద‌రికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మ‌న‌సారా కోరుకుంటున్నానని చెప్పారు. 

Related posts