telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

డేటా చౌర్యం కేసు : సిట్ చేతికి .. డేటా .. చౌర్యమా/నిర్లక్ష్యమా.. !!

distict wise report on ap
ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌కు, డేటా చౌర్యం కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్‌ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్కుల్లో డేటా అంతా చేరింది. హార్డ్‌ డిస్కుల నుంచి సేకరించిన వివరాలను తెలంగాణ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరెటరీ అధికారులు న్యాయస్థానానికి అందజేస్తే అక్కడి నుంచి దర్యాప్తు కోసం సిట్‌ అధికారులు తీసుకున్నారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చంగా ఆధార్‌ డేటాబేస్‌లో సమాచారమే ఈ హార్డ్‌డిస్కులలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
శాస్త్రీయంగా నిరూపించేందుకు ఐటీ గ్రిడ్‌ వద్ద ఎలాంటి సమాచారం ఉందన్న విషయాన్ని అక్కడ స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్కులకు ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించింది. ఆధార్‌ సర్వర్‌లో ఉన్నట్లుగానే పౌరుల కలర్‌ ఫొటోలు, ఆధార్‌ నంబరు, ఎన్‌రోల్‌మెంట్‌ నంబరు, పౌరుని పేరు, తండ్రి/భర్తపేరు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, పిన్‌కోడ్‌లతో పాటు ఫోన్‌ నంబరు వంటి వివరాలు ఐటీ గ్రిడ్‌ హార్డ్‌ డిస్కుల్లో ఉన్నట్లు ఫోరెన్సిక్‌ విశ్లేషణలో వెల్లడైంది. వాస్తవానికి ఐటీ గ్రిడ్‌లో పోలీసులు తనిఖీ చేసినప్పుడు పౌరుల నలుపు-తెలుపు ఫొటోలు ఉన్నాయి. హార్డ్‌ డిస్కుల్లో తొలగించిన డేటాను తిరిగి రాబట్టినప్పుడు వారి కలర్‌ ఫొటోలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. మొత్తం 7,82,21,397 మంది పౌరుల వివరాలు ఫోరెన్సిక్‌ నిపుణులు తమ నివేదికలో పొందుపరిచారు. 
దీని ప్రకారం ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టిన సిట్‌ అధికారులు ఖచ్చితంగా ఈ వివరాలన్నీ ఆధార్‌ సర్వర్‌ నుంచే తీసుకున్నట్లు భావిస్తున్నారు. వీటిని పొందేందుకు ఐటీ గ్రిడ్‌ ప్రతినిధులు  ఆధార్‌ డేటాలోకి చొరబడ్డారా.. ఎవరైనా అధికారికంగానే వీరికి అందజేశారా అన్నదానిపై సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఒకవేళ ఐటీ గ్రిడ్‌ సంస్థ ఆధార్‌ వివరాలు చౌర్యం చేస్తే సంబంధింత అధికారుల వైఫల్యం కిందికి వస్తుంది. ఉద్దేశపూర్వకంగా సమాచారం చేరవేసి ఉంటే ఇందులో కుట్ర దాగినట్లు పరిగణిస్తారు. ఈవ్యవహారంలో సహకరించిన అధికారులపై సిట్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

Related posts