అమెరికా తాజాగా తెహ్రెక్-ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్ర సంస్థ చీఫ్ నూర్ వలీ సహా మరికొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు ట్రంప్ సంతకంతో కూడిన కార్యనిర్వాహక ఉత్తర్వు విడుదలైంది. 2001 సెప్టెంబరులో అమెరికాపై జరిగిన ఉగ్రదాడులకు గుర్తుగా మంగళవారం ఈ ఉత్తర్వును విడుదల చేశారు. టీటీపీ సహా మరో 11 ఉగ్ర సంస్థలు, అందులోని ఉగ్రవాదులను ఈ జాబితాలో చేర్చారు. ఇలా చేయడం ద్వారా ఉగ్ర సంస్థల నాయకులపై నిఘాతోపాటు ఎవరెవరు ఉగ్ర శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారో తెలుసుకోవడం అమెరికా ప్రభుత్వానికి సులువవుతుందని ట్రెజరీ విభాగం కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ అన్నారు. గతంలో కన్నా మరింత మెరుగ్గా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నామని, వారికి ఆర్థిక వనరులను నిలువరించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యనిర్వాహక ఉత్తర్వును అత్యంత ముఖ్యమైనదిగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పాంపియో అభివర్ణించారు. అమెరికా అధికార పరిధికి లోబడి ఉత్తర్వులో పేర్కొన్న వారి ఆస్తులన్నీ స్తంభింప చేసే వీలుంటుందని, అమెరికా పౌరులు వీరితో ఎలాంటి లావాదేవీలూ జరపకుండా నిషేధించవచ్చని పాంపియో వెల్లడించారు. టీటీపీ మాజీ చీఫ్ ముల్లాహ్ ఫజుల్లాహ్ 2018లో మృతి చెందిన నాటి నుంచి ఆ సంస్థకు నూర్ వలీ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయన నాయకత్వంలోనే పాకిస్థాన్‌లో చాలా చోట్ల దాడులు జరిగాయి. వీటికి తామే బాధ్యులమని టీటీపీ సంస్థ ప్రకటించుకుంది.