తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం లేదా 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ సన్నద్ధతపైనా కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో పంటల సాగు, దిగుబడి అంచనాలపై మంత్రిమండలి సమీక్షించింది. వానాకాలం పంటల కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై చర్చించారు
అలాగే విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, కరోనా పూర్తిగా అదుపులో వుందని తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో వున్నాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను.. ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసనమండలిలో ప్రస్తుతం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీగా ఉంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు శాసనసభ సమావేశాల్లోపు అనుమతి లభిస్తే వెంటనే మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమావేశాల్లో ఐదు ముసాయిదా బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గృహనిర్మాణ సంస్థ చట్టం, ఉద్యానవన విశ్వవిద్యాలయం చట్టాలను సవరిస్తూ గతంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు తీసుకురానున్నారు. పర్యాటకులపై దాడులను నియంత్రించేలా ప్రత్యేక చట్టం కోసం బిల్లు, రిజిస్ట్రేషన్ చట్ట సవరణ, పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ 24వ తేదీన ఉదయం 11 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశమై అసెంబ్లీ ఎజెండాను ఖరారు చేయనున్నారు.