తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 8న విడుదలచేసేందుకు బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం పనులు దాదాపు ముగిశాయి. ప్రస్తుతం ట్యాబ్లేషన్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
జూన్ 1 నుంచి 2019-20 నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వేసవి సెలవుల్లో అడ్మిషన్లు, తరగతులు నిర్వహించే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాలకోసం ప్రకటన విడుదలచేసిన తర్వాతే కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలని తెలిపారు.