telugu navyamedia
తెలంగాణ వార్తలు

తమది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ -మోడీ సర్కార్‌పై సీఎం కేసీఆర్ ఫైర్..

బీహార్ ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్ బీజేపీ విధానాలు, మోదీ పరిపాలనపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం అభివృద్ధి చెందాలన్న, శాంతియుతంగా ప్రజలంతా సుఖంగా ఉండాలన్న బీజేపీ ముక్త్ భారత్ తప్పకుండా అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు.

గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ అనంతరం సీఎం కేసీఆర్‌, బీహార్‌ ముఖ్యంత్రి నితీశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలో ఒక్క వర్గానికి మేలు జరగలేదన్నారు. పైగా రూపీ విలువ పతనం, అంతర్జాతీయంగా దేశ పరువుకు నష్టం చేసేలా మోడీ ప్రవర్తన ఉందన్నారు. రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోడీ సర్కార్ చేసేందేమీ లేదని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కచ్చితంగా సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రధాని మోడీని వ్యతిరేకించే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ లను ఉసిగొల్పుతున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. అలాంటి వాటికి తాను భయపడేది లేదని తేల్చిచెప్పారు. విపక్షాల గొంతునొక్కేందుకు మోడీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఒక్కటి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మీడియా తమది థర్డ్ ఫ్రంట్ అంటుందని అలాంటి పేరు ఏమీ పెట్టవద్దని సీఎం కోరారు. త్వరలో అన్ని పార్టీ నేతలు కలిసి చర్చించి మెయిన్ ఫ్రంట్ గా అవతరిస్తామన్నారు.

విస్తృత చర్చ అనంతరం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికలప్పుడు నాయకుడిని ఎన్నుకుంటామని.. నాయకత్వం గురించి తెలుపుతామని ప్రకటించారు.

దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఘోరంగా పతనమైందని పేర్కొన్నారు.

రైతులు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోడీ సర్కారు ఏం చెయ్యలేదంటూ మండిపడ్డారు. తన కార్పొరేట్‌ మిత్రుల కోసమే ప్రధాని మోడీ తపనపడుతున్నారని విమర్శించారు.

Related posts