telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మావోయిస్టులు విద్యార్థులుగా.. కళాశాలలో రాష్ట్ర రాజకీయాలు..

telangana state politics into colleges

విద్యార్థి సంఘాల, ప్రజాసంఘాల మాటున మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్నాయా .. ఏజెన్సీ గ్రామాల్లో నే కాకుండా పట్టణాలు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో నూ మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారా అంటే అవును అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సంఘాలను , మావోయిస్టు పార్టీ పట్ల కాస్త సానుభూతి వ్యక్తం చేసే సంఘాలను మావోయిస్టు అనుబంధ సంఘాలుగా పేర్కొంటూ నిషేధం విధించారు. అయితే ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని మావోయిస్టులతో తమకేమీ సంబంధం లేదని విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు వాపోతున్నారు. అసలు విషయానికొస్తే ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులపై పోలీసులు అరెస్టులకు పూనుకున్నారు. మావోయిస్టులతో సంబంధమున్న విద్యార్థి వేదిక అధ్యక్షుడు బండారి మద్దిలేటి తో సహా జగన్, సాయన్న లను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు అయిన మద్దిలేటి, జగన్ తదితరులు మావోయిస్టులకు సహకరిస్తున్నారని వీరిపైన ఆరోపణలున్నాయి.

విద్యార్థి నేతలు సందీప్, నాగరాజు, గోపి, ఖాసిం, మహేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనుదీప్ లపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. విద్యార్థి నేతల కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉందని ప్రకటించిన పోలీసులు మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్న 30 సంస్థలను నిషేధించినట్టు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థి వేదిక సంస్థ మావోయిస్టు పార్టీ నుండి ఆవిర్భవించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమారి పేర్కొన్నారు. టీవీవీ నాయకుల అరెస్టు గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ సంఘాల పేరుతో విద్యార్థులను, యువతను ఆకర్షిస్తూ మావోయిజం వైపు మళ్ళిస్తున్నారని సిపి ఆరోపించారు. ప్రజాసంఘాల నేతలు సిపి అంజనీ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ నేత మాట్లాడినట్టు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు గత 50 ఏళ్లుగా ప్రజలతో మమేకమై కళాకారులుగా, రచయితలుగా, పోరాట యోధులుగా, హక్కుల కార్యకర్తలుగా, ఉద్యమ సారధులుగా ఉన్నామని అలాంటి మా పై నిషేధం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే వారి గొంతు అణిచివేయడం కోసం సీఎం కేసీఆర్ కుట్రకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే మావోయిస్టుల పేరుతో భయపెడుతున్నారని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.

Related posts