తనపై పెట్టిన దొంగ కేసులకు భయపడేది లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై నాని ఘాటుగా స్పందించారు.
సామాజిక దూరం పాటిస్తూనే తాను నిత్యావసరాలు పంపిణీ చేశానని, గుమిగూడినట్టు మార్ఫింగ్ ఫొటోలు పెట్టి తనపై కేసు పెట్టారని ఆరోపించారు. తనపై పెట్టిన దొంగ కేసులకు భయపడి పేదలకు, ఆపదలో ఉన్న వారికి సేవ చేయడం మానేస్తానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు.