telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పందెంకోడి’ విశాల్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Vishal

తెలుగు… తమిళ భాషల్లో సమానంగా క్రేజ్‌నీ మార్కెట్‌ని సంపాదించుకున్న కథానాయకుల్లో విశాల్‌ ఒకరు. ఈరోజు విశాల్‌ పుట్టినరోజు… ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వతహాగా తెలుగువారైన ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. కానీ ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులో అనువాదమవుతూ ఉంటుంది. దాంతో తెలుగులోనూ ఆయనకి అభిమానులున్నారు. ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డి, జానకీదేవి దంపతులకి 29 ఆగస్టు 1977న చెన్నైలో జన్మించారు విశాల్‌. విశాల్ కు ఒక తమ్ముడు విక్రమ్‌కృష్ణ (నటుడు, నిర్మాత), చెల్లెలు ఐశ్వర్య ఉన్నారు. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్‌ కమ్యూనికేషన్‌ చదువుకున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడైన అర్జున్‌ వద్ద సహాయ దర్శకునిగా సినీ ప్రయాణాన్ని ఆరంభించారు విశాల్‌. 2004లో ‘చెల్లమే’ అనే సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు.

Vishal

ఆ తరువాత ‘సందకోళి’, ‘తిమిరు’ సినిమాలతో విజయం అందుకున్నారు. సందకోళి తెలుగులో ‘పందెంకోడి’గా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ఆ సినిమాలో కనిపించారు. స్వతహాగా ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. తప్పు అనిపిస్తే ఎదుటివ్యక్తి ఎవరని కూడా చూడకుండా తన గళాన్ని గట్టిగా వినిపించడం విశాల్‌ శైలి. నటుడిగానే కాకుండా, తన వ్యక్తిత్వంతోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన.

విశాల్‌ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థని ఆరంభించి అందులో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. విశాల్‌ సోదరుడు విక్రమ్‌ కృష్ణ కూడా నిర్మాతే. సామాజిక స్పృహ, సేవాభావం మెండుగా ఉన్న విశాల్‌ తాను కథానాయకుడిగా నటించే సినిమాలకి వచ్చే డబ్బులో కొంతభాగం రైతుల కోసం కేటాయిస్తుంటారు. ఒకొక్క టికెట్టుపై ఒక్కో రూపాయి రైతులకి చెందాలనేది ఆయన అభిమతం. ‘అభిమన్యుడు’ సినిమాకి వచ్చిన ఆదాయంలో అలా ఒక్కో టికెట్టుపై ఒక్కో రూపాయి లెక్కగడుతూ రైతులకి అందజేశారు.2018లో ‘పందెంకోడి2’తో సందడి చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌ కథనాయకుడిగా నటించిన ‘టెంపర్‌’కి రీమేక్‌గా ‘అయోగ్య’ చిత్రం చేశారు.  ప్రస్తుతం ఎమ్మెస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో ‘చక్ర‌’ అనే చిత్రం చేస్తున్నారు. విశాల్ ఇంకా ఇలాంటి పుట్టినరోజులెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ నవ్యమీడియా తరపున విశాల్ కు జన్మదిన శుభాకాంక్షలు.

Related posts