telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ట్యూషన్ టీచర్ ద్వారా 14 మంది విధ్యార్థులకు క‌రోనా!

corona vairus

క‌రోనా ఉధృతి దృష్ట్యా పాఠ‌శాల‌ల‌ను ప్ర‌భుత్వాలు మూసివేశాయి. ఈ నేపథ్యంలో కొంద‌రు త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ట్యూష‌న్ల‌కు పంపించి కొవిడ్‌ను కొని తెచ్చుకుంటున్నారు. అలా ఓ ట్యూష‌న్ టీచ‌ర్ నుంచి 14 మంది పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాప్తి చెందింది. ఈ  ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బాధిత విద్యార్థులందరూ 12 ఏళ్ల లోపు వారే ఉన్నారు. ట్యూషన్ చెపుతున్న టీచర్, ఆయన భార్య నుంచి విద్యార్థులతో పాటు, కొందరు తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. బత్లూరు పీహెచ్సీ డాక్టర్ శేషుకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా కారణంగా సెప్టెంబర్ 25న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మరణించారు. ఆయన వచ్చిన ప్రాంతం ఇప్పటి వరకు గ్రీన్ జోన్ గా ఉంది.

కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే ఆ ప్రాంత వ్యక్తి చనిపోవడంతో ఆ ప్రాంతంలోని 250 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా వారిలో 39 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. వీరిలో 14 మంది విద్యార్థులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ట్యూషన్ చెప్పిన టీచర్ నరసరావుపేటలోని ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నారు. గర్భవతిగా ఉన్న ఆయన భార్యకు డెలివరీ ముందు కరోనా పాజిటివ్ అని తేలింది. ట్యూషన్ చెప్పిన టీచర్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు

Related posts