telugu navyamedia
రాజకీయ సామాజిక

రేపే శ్రావణ మాసము ప్రారంభం..

శ్రావణ మాసము తెలుగు వారికి చాలా ప‌విత్ర‌మైది. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ మాసం మ‌హాల‌క్ష్మీ ఇష్ట‌మైన మాసంగా చెప్ప‌కుంటారు. శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. ఈ సంవ‌త్సం ఆగ‌స్టు 9 సోమ‌వారం ప్రారంభం అయ్యి..సెప్టెంబ‌ర్ 7 వ‌ర‌కు ఉంటుంది.

పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.

శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది.

అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం శ్రావణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో స్త్రీలు సౌభాగ్యము నిచ్చే వ్రతాలు చేస్తారు. ముఖ్యంగా శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. అదే విధంగా ఈమాసంలోనే మంగళవారం నూతన వధువులు నాడు మంగళ గౌరీ వ్రతం కూడా చాలా మంది పాటిస్తారు.

పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. “గృహిణీ గృహముచ్యతే” అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది.

అంతేకాకుండా ..వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.

Related posts