బీజేపీ సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. సమాచార కమిషనర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో సోనియా గాంధీ స్పందించారు. నూతన నిబంధనల పేరుతో ఆర్టీఐ చట్టాన్ని, సమాచార కమిషనర్ల జవాబుదారీతనాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమిషనర్లు ఎవరైనా సమాచారం అందించాలని ప్రయత్నిస్తే కొత్త నిబంధనల పేరుతో వారిని సులభంగా విధుల్లో నుంచి తొలగించవచ్చు. కేంద్రం, రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్లపై కూడా ఈ ప్రభావం భారీగా పడుతుంది. సమాచార కమిషనర్ల స్వాతంత్య్రాన్ని కాపాడేందుకే ఐదేళ్ల పదవీకాలం, స్థిర జీతాలు ఉండేలా నిబంధనలు రూపొందించారు. కీలకమైన హోదాలో ఉన్న కమిషనర్లకు అందాల్సిన సౌలభ్యాలను భాజపా ప్రభుత్వం తొలగించింది.
స్వాభిమానం ఉన్న ఏ ఒక్క సీనియర్ అధికారి కూడా ఇలాంటి వాతావరణంలో పనిచేసేందుకు ఇష్టపడని విధంగా పరిస్థితులను మోదీ ప్రభుత్వం కల్పించిందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్టీఐ చట్టంలో తీసుకొచ్చిన మార్పుల ప్రకారం కేంద్రం, రాష్ట్రాల్లోని సమాచార కమిషనర్ల జీతభత్యాలు, పదవీకాలంలో మార్పులు రానున్నాయి. గతంలో కమిషనర్ల పదవీకాలం ఐదేళ్లుండగా.. నూతన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉన్న సమాచార కమిషనర్ల వేతనాలు ఇకమీదట కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ విధంగా ఆర్టీఐ చట్టంలో మార్పులు తీసుకొచ్చి కమిషనర్ల స్వయంప్రతిపత్తికి అడ్డుకట్ట వేసినట్లే అవుతుందని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.