telugu navyamedia
క్రీడలు వార్తలు

వికెట్ పడినప్పుడు ఏం చేయాలో తెలియదు… అందుకే..?

వికెట్ తీసిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తనకు తెలియదని, చిన్నప్పటి నుంచి తానింతేనని టీమిండియా సెన్సేషన్ టీ నటరాజన్ అన్నాడు. అయితే మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తీక్‌తో తమిళంలో మాట్లాడిన నట్టూ…. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వికెట్ తీసిన తర్వాత ఇతర బౌలర్లలా ఎందుకు సెలెబ్రేట్ చేసుకోవని, ఆగ్రహంగా ఎందుకు ఉండవని మురళీ కార్తీక్ ప్రశ్నించగా.. తాను చిన్నప్పటి నుంచి ఇంతేనని సమాధానమిచ్చాడు. ‘చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు. చిన్నప్పటి నుంచి నేనింతే. వికెట్‌ తీసిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో నాకు తెలియదు. అందుకే ఒక చిరునవ్వుతో సరిపెట్టేస్తాను. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఏదేమైనా.. ఈ టూర్ నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. బలమైన ఆసీస్ జట్టుపై నేను బాగా ఆడగలిగాను. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. నా ప్రదర్శన పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నా. జట్టు సభ్యులందరూ నాకు అండగా నిలవడం వల్లే ఇది సాధ్యమైంది’అని ఈ పేసర్ చెప్పుకొచ్చాడు.

నెట్‌బౌలర్‌గా వచ్చిన తనకు వన్డే, టీ20ల్లో ఆడే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదని, వరుణ్‌ చక్రవర్తి గాయం కారణంగా తనకు అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. అనూహ్యంగా వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగానని, ఈ టూర్‌ నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించేది ఏమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించడం వల్లే ఇక్కడిదాకా వచ్చానన్న ఈ తమిళనాడు పేసర్‌.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశాడు. ‘నా బలాలేమిటో నాకు తెలుసు. నన్ను నేను నమ్ముకున్నా. పిచ్‌ స్వభావం గురించి వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌తో ముందుగానే చర్చించేవాడిని. అందుకు అనుగుణంగానే బౌలింగ్‌ చేశాను. డెత్‌ ఓవర్లలో కట్టర్స్‌, యార్కర్లు వేశాను. ఐపీఎల్‌లో ఏం చేశానో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాను. అనుకున్నది అనుకున్నట్లుగా ఆచరణలో పెట్టాను” అని తెలిపాడు.

Related posts