భారతజట్టు తాత్కాలిక సారథి రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో వాయుకాలుష్యం ఎలాంటి అడ్డంకులు సృష్టించబోదని అన్నాడు. అరుణ్‌జైట్లీ మైదానంలో నవంబర్ 3న మ్యాచ్ సాఫీగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంది. దీపావళి రోజున బాణసంచా కాల్చడంతో ఇది మరీ ఎక్కువైంది. గురువారం జరిగిన సాధనలో బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ముఖానికి 10 నిమిషాలు మాస్క్ ధరించాడు. బ్యాటింగ్ చేసినప్పుడు మాత్రం తీసేశాడు. మిగతా ఆటగాళ్లెవరూ మాస్క్‌లు వేసుకోలేదు.
నేనిప్పుడే (దిల్లీ) చేరుకున్నా. వాతావరణ పరిస్థితి తెలుసుకొనేంత సమయం దొరకలేదు. షెడ్యూలు ప్రకారం నవంబర్ 3న మ్యాచ్ సాఫీగా జరుగుతుంది. మేం శ్రీలంకతో గతంలో మ్యాచ్ ఆడినప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కోలేదు. దీనిపై చర్చించనూ లేదు. నాకైతే ఎలాంటి ఇబ్బంది రాలేదని రోహిత్ శర్మ అన్నాడు. అప్పటి టెస్టు మ్యాచులో లంకేయులు మాస్క్‌లు ధరించి ఆడారు. ఊపిరి పీల్చడం కష్టంగా ఉందని అంపైర్‌కు పదేపదే ఫిర్యాదు చేస్తూ మ్యాచ్‌కు అడ్డంకులు కలిగించారు. 20 నిమిషాల పాటు ఆటను నిలిపివేసిన విషయం తెలిసిందే.