telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శ్రావణమాసంలో .. సోమనాథుడి దర్శనం… సకలశుభాలకు ఆలవాలం…

somanadh darsan in sravanamas

హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సోమనాథుని క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో కొలువై ఉంది. శివపురాణం, నంది పురాణంలో పరమేశ్వరుడు, ప్రతి చోటా నేను కొలువై ఉంటాను, కానీ ఈ పన్నెండు ప్రదేశాల్లో మాత్రం మరింత ప్రభావవంతంగా ఉంటాను.. అని చెప్పినట్లు ప్రతీతి. అయితే ఈ పన్నెండు ప్రదేశాలనే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలని అంటారు. లయ కారుడైన ఆ పరమేశ్వరుడు ఈ పవిత్ర క్షేత్రాల యందు కొలువుదీరగా, అటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో గుజరాత్‌లోని సోమనాథ ఆలయం మొదటిది కావడం విశేషం. ఇక పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేయగా, చంద్రుడు మాత్రం కేవలం రోహిణి దేవితోనే ఎంతో సౌఖ్యంగా ఉండడం, మిగిలిన భార్యలను సరిగా చూసుకోకపోవడంతో తమ తండ్రైన దక్షప్రజాపతికి ఆ మిగిలిన 26 మంది భార్యలు ఫిర్యాదు చేయడంతో, ఆగ్రహించిన దక్షుడు, చంద్రునికి క్షయవ్యాధి కలిగేలా శాపమిస్తాడు. అయితే ఆ వైద్యనిని నయం చేసుకోవడం కోసం భూలోకానికి వచ్చిన చంద్రుడు, ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో పరమ శివుని లింగాన్ని ప్రతిష్టించి ఘోర తపస్సు చేయడం, ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, చంద్రుని అచంచల భక్తికి మెచ్చి, తనకు అత్యంత ఉన్నతమైనది ఇవ్వదలిచాడు. దానితో దక్షుడు అంతటివాడు ఇచ్చిన శాపాన్ని తాను చిన్నబుచ్చలేనని, అందుకే చంద్రకళలు ఇస్తున్నానని వరం ఇచ్చాడు శివయ్య. అంతేకాకుండా చండుడిని తన శిరస్సుపై స్థానాన్ని ఇచ్చాడు. అప్పటి నుండే శివుడికి చంద్రసంబంధిత నామాలు వచ్చాయి.

చంద్రునికి ఇక్కడ శాపవిముక్తి జరిగినది కాబట్టే, ఈ మహిమాన్విత ప్రదేశానికి సోమనాథక్షేత్రం అనే పేరు రావడం జరిగిందట. తన వ్యాధి నయం కావడంతోపాటు తన కుటుంబం కూడా ఎంతో సంతోషమయం కావడంతో, ఎంతో ఆనందపడ్డ చంద్రుడు, బంగారంతో ఈ ఆలయం నిర్మించారని, ఆ తరువాత త్రేతాయుగంలో కాలంలో రావణాసురుడు వెండితో, అలానే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు ఇప్పటికీ అక్కడ కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. చరిత్ర ప్రకారం క్రీ.శ. 1024లో గజినీ మహమ్మద్ అలానే ఆ తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు తదితరులు ఈ క్షేత్రం పై దాడి చేసి అందులోని విలువైన సంపదను కొల్లగొట్టడంతో పాటు ఆ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో, వారి తరువాత తరాల్లో వచ్చిన పాలకులు ఈ క్షేత్రాన్ని మరమ్మత్తులు గావించడం జరిగింది. ఇక ఆ తరువాత జునాగఢ్‌ సంస్థానం మన భారత దేశంలో విలీనం కావడంతో భారతదేశ ప్రథమ హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్‌పటేల్‌ అప్పట్లో ఈ ఆలయాన్ని సందర్శించి, దాని పునర్నిర్మాణాన్ని గావించగా, 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత, మన రాష్ట్రపతి బాబురాజేంద్రప్రసాద్‌ ఆలయాన్ని ప్రారంభించారు.

Related posts