telugu navyamedia
తెలంగాణ వార్తలు

సింగరేణి కార్మికులకు 72, 500 బోనస్‌

సింగరేణి కార్మికులకు శుభవార్త‌. 72, 500 బోనస్ ప్రకటించిందిసింగరేణి. గతేడాది కార్మికులకు 68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది. ఈ ఏడాది ఆ బోనస్ మొత్తాన్ని పెంచింది. తాజా నిర్ణయంతో సింగరేణిలో ఉన్న 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) 72,500 చెల్లించాలని అంగీకరించాయి. ఆక, సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరమున్నదన్నారు. బొగ్గుతవ్వకంతో పాటు ఇసుక, ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని తెలిపారు. ఇవాళ సమీక్ష నిర్వహించిన సీఎం.. బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని అన్నారు. నిబద్దతతో నిరంతర శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వున్నదన్నారు. సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గుతవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి ఇనుము తదితర ఖనిజాల తవ్వకాలలో వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

Related posts