telugu navyamedia
క్రీడలు వార్తలు

పృథ్వీ షా తో , శివమ్ మావి ఫైట్…

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్..బౌలింగ్, బ్యాటింగ్ సత్తా ఏమిటనేది మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్..తొలి ఓవర్ నుంచి టాప్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. శివమ్ మావి వేసిన తొలి ఓవర్‌లోనే ఒక వైడ్ సహా 25 పరుగులొచ్చాయి. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా ఆరు బంతులకు ఆరు బౌండరీలను బాదేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు బౌండరీలను కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ అతనే. ఇదివరకు భారత్‌కే చెందిన అజింక్య రహానే ఈ ఫీట్ సాధించాడు. నాలుగు ఓవర్లను వేయాల్సిన శివమ్.. ఆ ఒక్క ఓవర్‌ తరువాత మరోసారి బౌలింగ్ చేయడానికి ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు. ఒక ఓవర్‌లో 25 పరుగులను సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడతను. నిజానికి- పృథ్వీ షా, శివమ్ మావి టీమ్ మేట్స్. వారిద్దరూ టీమిండియా అండర్ 19 జట్టుకు ఆడారు. 2018 అండర్ 19 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టులో వారిద్దరూ సభ్యులు. ఒకరి బ్యాటింగ్ టెక్నిక్ మరొకరికి, ఒకరి బౌలింగ్ లొసుగులు మరొకరికి బాగా తెలుసు. శివమ్ బౌలింగ్‌లో చెలరేగిపోయి ఆడటానికి కారణాన్ని వివరించాడు పృథ్వీ షా. తామిద్దరం నాలుగైదుళ్లుగా కలిసి ఆడుతున్నామని, అతని బౌలింగ్ టెక్నిక్‌పై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. తనకు శివమ్ ఎక్కడెక్కడ బంతులను సంధిస్తాడనేది బాగా తెలుసని, అందుకే తాను ముందుగానే ప్రిపేర్ అయ్యాననీ పేర్కొన్నాడు పృథ్వీ షా. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం శివమ్ మావి.. పృథ్వీ షాను అభినందించడం.. చిరుకోపాన్ని ప్రదర్శించడం ఆకట్టుకుంది.

Related posts