telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఆర్టీసీ డీపోలవద్ద .. కార్మికుల చేరికలతో సందడి..

rtc employees started joining

రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్మికులంతా ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేరవచ్చంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో వారంతా ఉదయం నుంచే డిపోలకు చేరుకుంటున్నారు. షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకోవడం సంతోషకరమని, సంస్థను అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామని వారు అంటున్నారు. సమ్మెలో అమరులైన కార్మికులను నివాళులర్పించి విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీ తమకు అమ్మలాంటిదని.. అనునిత్యం కాపాడుకుంటామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాలా, కరీంనగర్‌, వరంగల్‌ సహా అన్ని జిల్లాల్లోని వివిధ డిపోలకు చెందిన కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీకి రూ.100 కోట్ల తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. సంస్థ మనుగడ కోసం కిలోమీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీలను పెంచుతున్నామన్నారు. సోమవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. ఛార్జీల పెంపుదల ద్వారా రూ.760 కోట్ల అదనపు ఆదాయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. సమ్మెకాలంలో చనిపోయిన కార్మికులకు సంబంధించి వారి కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఉద్యోగం ఇస్తామన్నారు. ఆర్టీసీని బాగు చేసేందుకు నాలుగైదు రోజుల్లో ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తామని, ఒక్కో డిపో నుంచి అయిదు నుంచి ఏడుగురిని ఆహ్వానిస్తామన్నారు. ఇందులో సంఘాలకు అవకాశం లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి వేధింపులు లేకుండా ప్రతి డిపోలో ఇద్దరేసి కార్మికులతో సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. సమ్మెకాలంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తామని చెప్పారు.

Related posts