telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దేవులపల్లి వారు తెలుగువారు కాబట్టే జాతీయ స్థాయి గౌరవం రాలేదు : కె.వి.రమణ

Devulapalli

“జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి గీతాన్ని అందించిన మహాకవి దేవులపల్లికృష్ణ శాస్త్రి గారిని ఈరోజు వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అదృష్టం. దేవులపల్లికృష్ణ శాస్త్రి గారు తెలుగువారు కాబట్టి ఈ గీతానికి వందేమాతరం, జనగణమనలా జాతీయ స్థాయి గౌరవం రాలేదేమో అనిపిస్తోంది అన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె .వి.రమణ.

Devulapalli

‘ఆంధ్ర షెల్లి’గా, విశ్వకవి రవీంద్రనాద్ గారితో పోల్చబడి మహాకవి, ‘భావ కవితా కోకిల’ దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి 123వ జన్మదినాన్ని ఆదివారం రోజు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారు, శ్రీ సాంస్కృతిక కళాశాల సంస్థ వారు సంయుక్తంగా నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనం అపురూపమైన కార్యక్రమం… ఆలోచనే గొప్పది… అది ఆచరణ సాధ్యమైనట్లుగా చేయడానికి వీలుగా రెండు సంస్థలు ముందుకు రావడం, సారస్వత అభిమానులకందరికి విజయదశమి, దీపావళి కలిపి జరుపుకున్నట్లుగా ఉంది అని ఆయన అన్నారు.

భారతదేశంలోనే కాకుండా సింగపూర్, అమెరికా, హాంకాంగ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్టేలియా ఇలా ఇతర దేశాల నుంచి గాయనీ గాయకులను సమకూర్చుకుని, ఈ కార్యక్రమాన్ని 12 గంటల పాటు నిర్వహించడం, దేవులపల్లివారిపై మనకున్న అభిమానాన్ని తెలియజేయడంగా ఉంది… దేవులపల్లివారి గురించి నేటి తరానికి తెలియచేయాలనే సదుద్దేశంతో వంశీ రామరాజుగారు ఇతర దేశాలలోని తెలుగువారిని సమన్వయపరచుకుని చేయడం, నాలాంటి దేవులపల్లి అభిమానులకు ఆనందంగా ఉంది అన్నారు.

Devulapalli

ఈ కార్యక్రమంలో రాధికా మంగపూడి, వంగూరి చిట్టెన్ రాజు, తాళూరి చంద్ర శేఖర్, తోటకూర ప్రసాద్, జయశీల, విజయగారికి అలాగే పాల్గొంటున్న ఇతర దేశాలవారికి, మన భారత దేశపు గాయనీ గాయకులకు వందనం… అలాగే వెదవయతీ ప్రభాకర్ గారికి, చిత్తరంజన్ ప్రభాకర్ గారికి, వెన్నెలకంటిగారికి, సుద్దాల అశోక్ తేజగారికి మిగిలిన ఎంతో మందికి పేరు పేరునా, నా వందనాలు… ఇది వంశీ రామరాజుగారి రచనా చుతురత… ఒక్క చోట కార్యక్రమం చేయాటంలోనే ఎంతో కష్టం ఉంటుంది… అలాంటిది ఇంత మందిని ఒకే వేదికపైకి కలిపి, అది కూడా జూమ్ లో కలుపుకుంటూ, నవంబర్ 1 అంటే దేవులపల్లివారి పుట్టినరోజు అని ప్రపంచానికి తెలియజేస్తున్న వంశీ రామరాజుగారికి, శ్రీ సాంస్కృతిక సంస్థ వారికి నమోవాక్కాలు అని రమణ చెప్పారు.

దేవులపల్లి సాహిత్యం ఎలా ఉంటుందంటే సర్కస్ లో రింగ్ మాష్టర్ పిలవగానే పులులు అన్నీ వచ్చి వరుసగా కూర్చున్నట్లుగా, అక్షరాలు అన్నీ అలా ఆయన ఆధీనంలో ఉండి కవితాసుమాలుగా కూర్చబడ్డాయి. 1950 నుండి 1980 వరకు దాదాపుగా 30 ఏళ్ళు ఆయన పాటలు మాణిక్యాలు… 1951లో మల్లీశ్వరిలో మాటలు, పాటలు ఇప్పటికీ మరిచిపోలేము… ‘మనసున మల్లెలు’ పాట ఇప్పటికీ పాడుకుంటాము… ‘ఇది మల్లెల వేళయనీ’ పాట వైపు అందరూ ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారు… ఎంతో మంది పాటలు వ్రాస్తున్నారు… కానీ దేవులపల్లివారిలో ఉన్న లాలిత్యం ఇప్పటి కవుల్లో కనిపించదు. 100 సంవత్సరాల క్రితమే ఆయన హరిజనోద్దరణ కార్యక్రమం చేబట్టారు. ఆయన సాహితీ మిత్రుడే కాదు, సంస్కరణ వీధిలో కూడా మిత్రుడే… మిత్రుడంటే సూర్యుడు… ప్రపంచానికి అర్థమయ్యేలా ప్రపంచంలోని తెలుగు వారందరికీ దేవులపల్లి సాహిత్యం అర్థం అయ్యేలా అపురూపమైన, అద్భుతమయిన కార్యక్రమం చేస్తున్నారు….. ఆయన గళం మూగపోయినా ఆయన కలం ఆగలేదు… 1963 తరువాత ఆయన గుండె మూగపోయినా ‘రానిక నీ కోసం. సఖీ రాధికా వసంత మాసం’ అంటూ ఒక భగ్న ప్రేమికుడి ఆవేదన ఎంత మధురంగా రాశారో ఆయన పాటలన్నీ చాలా గొప్పవి… ఆయన దేశ భక్తుడే కాదు, భక్తి పరుడు కూడా, ఎన్నో భక్తి పాటలు వ్రాశారు. అలా వ్రాసిన ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘ఘనాఘన సుందరా’ లాంటివి ఇప్పటికీ మన మనసులో నిలచిపోయినాయి అని రమణ చెప్పారు.

12 గంటలపాటు నిర్వహించే ఈ సంగీత, సాహిత్య కార్యక్రమం ఒక పుష్ప గుచ్ఛంలాగా, ఒక ఫీస్ట్ లాగా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదంలా 58 పాటలతో ఇంత మంది గాయకులను కూడగట్టి చేయటం వీనుల విందుగా, కన్నుల పండువగా ఉంటుంది. ఈ కార్యక్రమలో ఒక మణిలాంటి ‘భువన చంద్ర’ గారికి పురస్కారం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సమన్వయకర్త వంశీ రామరాజుగారికి అభినందనలు తెలిపారు రమణ.

– విమలత

Related posts