telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కూరగాయల వ్యాపారికి 42వేల ఫైన్‌ వేసిన పోలీసులు

కరోనా దెబ్బకు ఖజానాలు కుదేలైపోవడంతో అన్ని రాష్ట్రాలూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్ల రేట్లను భారీగా పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జరిమానాలు అతి భారీగా ఉండటం చర్చనీయాంశమైంది. తెలంగాణలో ట్రాఫిక్ పోలసులు.. వాహనదారుల ఫోన్లకే నోటీసులు పంపుతున్నారు. ఇక కర్ణాటక-లోనైతే పిడుగుపాటు మాదిరిగా వాహనదారుల పాత బిల్లుల్నీ కలిపి చెల్లించమంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ కూరగాయల వ్యాపారి కథనం వైరల్ గా మారింది…హైదరాబాద్ మహానగరంలో సాధారణంగా నాలుగు సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంగిస్తే సదరు వాహన యజమానికి ఆటోమెటిగ్గా నోటీసులు వెళతాయి. కానీ బెంగళూరులో మాత్రం పోలీసుల చేతికి చిక్కేదాకా మన బండి మీద ఇంత ఫైన్ ఉందాని వాపోయే పరిస్థితి. సిటీలో చిన్న కూరగాయల షాపు నడుపుకొనే అరుణ్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.42వేల ఫైన్ పడింది.. గడిచిన కొద్ది నెలలుగా అరుణ్ కుమార్ తన వాహనంపై మొత్తం 77 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. ఇటీవల పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా హెల్మెంట్ లేకుండా వెళుతూ అరుణ్ పట్టుపట్టాడు. ట్రాఫిక్ పోలీసుల పోర్టల్ లో అతని బండి నంబర్ కొట్టిచూడగా.. రూ.42 వేల జరిమానా ఉన్నట్లు తేలింది.

ఆ మొత్తాన్ని ఒకేసారి కట్టాలని పోలీసులు డిమాండ్ చేయడంతో కథ మలుపు తిరిగింది.. సాదాసీదా కూరగాయల వ్యాపారి అరుణ్ కుమార్ కొన్నేళ్ల కిందట రూ. 20 వేలతో సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కున్నాడు. అదిగో ఆ బండిపైనే తిరుగుతూ, తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి రూ.42వేల జరిమానా కొనితెచ్చుకున్నాడు. రూ.20 వేల బండికి, రూ.42 వేల ఫైన్ చెల్లించలేక చివరికి తన బైక్‌ను మాడివాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి నడుస్తూ వెళ్లిపోయాడు. దీంతో చెల్లుకు చెల్లు అయినట్లేనా? అంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి వసూలు చేయాలనుకున్న పోలీసుల తీరు కరెక్టేనా? ఏకంగా 77 సార్లు ఉల్లంఘనలకు పాల్పడటం అరుణ్ కుమార్ కు తగునా? అని మీడియా, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా నివేదిక ప్రకారం.. జరిమానాల రూపంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు రావాల్సిన మొత్తం రూ.150 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా. వాటిని వసూలు చేసేందుకు పోలీసులు ఇటీవలే స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా దాదాపు రూ.కోటి దాకా వసూలు చేశారు..

Related posts