telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేడే తెలుగు వెండితెర సామ్రాజ్ఞి మహానటి సావిత్రి జయంతి

తెలుగుధాత్రిని పులకింప చేసిన అభినేత్రి సావిత్రి… తెలుగువారి అభిమానాన్ని అమితంగా చూరగొన్న నటీమణి సావిత్రి…తెలుగు సినిమాకు తన అభినయంతో వెలుగులద్దిన నటీశిరోమణి సావిత్రి…
ఇలా ఎంతగా మన అభిమానాన్ని కురిపిస్తూ పోయినా, సావిత్రి నటనముందు అది కొంతే అవుతుంది… డిసెంబర్ 6న మహానటి సావిత్రి 85వ జయంతి… ఈ సందర్భంగా సావిత్రి అభినయ వైభవాన్ని మననం చేసుకుందాం… సావిత్రి అభినయాన్ని చూడగానే ఓ భక్తిభావం మన మదిలో చోటు చేసుకుంటుంది… సావిత్రి నటనను ఒక్కసారి చూశామంటే చాలు ఆమెకు అభిమానులుగా మారకుండా ఉండలేం…అంతటి సమ్మోహనశక్తిని తన అభినయంలో మేళవించి మేటి చిత్రాలలో సాటిలేని నటనతో అలరించారు సావిత్రి…సావిత్రి అన్న మూడక్షరాల పేరు వినగానే తెలుగువారి మది ఆనందంతో పులకించిపోతుంది. ఆమె అభినయంతో పరవశింప చేసిన చిత్రాలు ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి. అనితరసాధ్యంగా సాగిన సావిత్రి అభినయాన్ని మననం చేసుకొనే కొద్దీ ఆమెపై అబిమానం కొండవీటి చేంతాడులా పెరిగిపోతూనే ఉంటుంది. అదీ సావిత్రి అభినయంలోని మహాత్యం. నాటి మేటి నటీనటులతో కలసి సావిత్రి సాగించిన చిత్రప్రయాణం గుర్తు చేసుకుంటే ఆ మహానటిపై మరింతగా అభిమానం పెంపొందుతుంది.

ఇక నయనాలతోనే సావిత్రి పలికించిన అగణిత భావాలనూ గుర్తు చేసుకుంటే ఆమెకు అభిమానులమయినందుకు గర్వంగానూ ఉంటుంది. ఆ రోజుల్లో టాప్ హీరోస్ కు సమానంగా పారితోషికం పుచ్చుకొని చరిత్ర సృష్టించారు సావిత్రి. అంతటి ఘనచరిత సొంతం చేసుకున్న సావిత్రి తొలుత యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన ‘సంసారం’ చిత్రంలో తన తగని సిగ్గుతో హీరోయిన్ పాత్ర చేజార్చుకుందని వింటే ఆశ్చర్యం కలుగక మానదు. దాంతో ‘సంసారం’లో ఏయన్నార్ జోడీగా నటించవలసిన సావిత్రి కాస్తా, అందులో ఓ పాటలో అలా వచ్చి ఇలా పోయే పాత్రకే పరిమితమయింది. ఆ సినిమాలో సావిత్రి నటనకు పనికిరాదు అని సర్టిఫికెట్ ఇచ్చిన దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తరువాత తాను తెరకెక్కించిన ‘పెళ్ళిచేసి చూడు’లో కీలక పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సినిమాతోనే సావిత్రి నటజీవితం ఓ కొత్త మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. అరుదైన ప్రతిభ గలవారికి అవకాశం రావాలే కానీ, తమ ప్రావీణ్యం ప్రదర్శించుకోకుండా ఉండరు కదా! ‘పెళ్ళిచేసి చూడు’లో యస్వీ రంగారావు కూతురుగా నటించిన సావిత్రి అభినయాన్ని చూసిన వేదాంతం రాఘవయ్య తన ‘దేవదాసు’లో కథానాయిక పార్వతి పాత్రకు సావిత్రిని ఎంపిక చేసుకున్నారు. అంతగా అనుభవం లేని నటితో పార్వతి వంటి బరువైన పాత్రను ధరింప చేయడం సబబు కాదని వేదాంతంను కొందరు హెచ్చరించారు కూడా. ఆయన మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఫలితంగా ‘దేవదాసు’లో పార్వతి పాత్ర సావిత్రి పరమయింది. అందులో ఆమె నటించలేదు. జీవించింది అంటే అతిశయోక్తి కాదు. ‘దేవదాసు’ చిత్రంతో నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న సావిత్రి ఆపై మరి వెనుతిరిగి చూసుకోలేదు. మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ కు విజయనాయికగానూ ఆమె అలరించారు.

ఆ ఇద్దరు మహానటులకు జోడీగా నటించి మెప్పించారు. ఆ సినిమాలు తెలుగువారిని ఎంతగానో పులకింప చేశాయి. సిగ్గుల మొగ్గయి హీరోయిన్ ఛాన్స్ పోగొట్టుకున్న సావిత్రి – ఆపై తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసిన తీరును తలచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు… అనితరసాధ్యంగా సాగిన సావిత్రి అభినయవైభవాన్ని గుర్తు చేసుకొనేకొద్దీ గుండెల్లో ఆమెకు గుడికట్టేస్తారు జనం… యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘సంసారం’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ మిస్సయిన తరువాత సావిత్రి నటనను ఓ సవాల్ గా స్వీకరించింది. అయితే ఆమె ఛాలెంజ్ తెలుసుకొని పాత్రలు పరుగులు తీసి ఆమె దరికి చేరలేదు. అందువల్ల అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నారామె. యన్టీఆర్ నటించిన మేటి జానపద చిత్రం ‘పాతాళబైరవి’లో ఓ బిట్ సాంగ్ లో మురిపించిన సావిత్రి, అదే విజయా సంస్థ నిర్మించిన పలు చిత్రాలలో నాయికగానూ మురిపించి మైమరిపించారు. దీనిని బట్టే సావిత్రిలోని పట్టుదల ఏ పాటిదో తెలుస్తుంది. విజయా సంస్థ నిర్మించిన అపురూప చిత్రాలు ఈ నాటికీ తెలుగువారిని విశేషంగా అలరిస్తూనే ఉన్నాయి. సదరు చిత్రాల్లో మేటిగా అభినయించి తనదైన నటనాపటిమను ప్రదర్శించారు సావిత్రి… విజయాసంస్థకు యన్టీఆర్ విజయనాయకుడయితే, సావిత్రి విజయనాయిక అన్న కీర్తినీ సొంతం చేసుకున్నారామె. సావిత్రి అనగానే ఈ తరం వారికి కూడా చప్పున గుర్తుకు వచ్చే చిత్రం ‘మాయాబజార్’… ఈ చిత్రంలో శశిరేఖగా ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఘటోత్కచుడు మాయా శశిరేఖగా మారిన తరువాత సావిత్రి కనబరచిన అభినయం మరపురానిది… నవతరం ప్రేక్షకులను సైతం మురిపిస్తూనే ఉంది. విజయా సంస్థనే కాదు నాటి మేటి నిర్మాణ సంస్థలు సావిత్రి కాల్ షీట్స్ కోసం ఎదురు చూసేవి. ఆమె డేట్స్ దొరికిన తరువాతే తమ చిత్రాలను ప్రారంభించిన సంస్థలూ ఉన్నాయి. ఆమె కోసం అనుకున్న పాత్రల్లో నిర్మాతలు, దర్శకులు మరొకరిని ఊహించుకోలేక పోయేవారు. అందువల్ల సావిత్రికి అనువైన సమయంలోనే తమ చిత్రాల షూటింగ్స్ పెట్టుకొనేవారు. ఇటు తెలుగులోనే కాదు, అటు తమిళనాట కూడా సావిత్రి తీరు ఇలాగే సాగింది. కొన్ని పాత్రల్లో సావిత్రిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆ రోజుల్లో నవలాప్రియులను ఎన్నో నవలలు మురిపించాయి. ఆ నవలలు చదువుతున్నప్పుడే కొన్ని పాత్రల్లో సావిత్రిని ఊహించుకొనేవారు పాఠకులు. అదే తీరున సదరు కథలు సినిమాలుగా తెరకెక్కిన సమయంలోనూ సావిత్రి వాటిలో నటించి అభిమానుల మనసులను పులకింప చేసేవారు. ఇలాంటి సందర్భాలు ఆమె నటజీవితంలో కోకొల్లలు. నవ్వించి కవ్వించే పాత్రల్లోనూ, కరుణతో కన్నీరు పెట్టించిన భూమికల్లోనూ సావిత్రి అభినయం జనాన్ని ఎంతగానో అలరించింది… ఒకటని ఏముంది? నవరసాభినయంలో తనకు తానే సాటిగా నిలిచారు సావిత్రి… ‘దేవదాసు’ వంటి విషాదాంత ప్రేమకథల్లో నటించిన సావిత్రి శోకదేవతగానే కాదు, నవ్వుల రాణిగానూ మురిపించింది. కొన్నిసార్లు కథానాయక పాత్రకు స్ఫూర్తి కలిగించే పాత్రల్లోనూ అలరించింది. ఏ తీరున సాగినా, సావిత్రి అభినయం జనాన్ని కట్టిపడేసింది. మళ్ళీ మళ్ళీ ఆమె నటన కోసమే థియేటర్లకు జనం వెళ్ళేలా చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. సాంఘిక చిత్రాలలోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ సావిత్రి అలరించిన తీరు అనితరసాధ్యం… ఆ పాత్రల్లో సావిత్రి అభినయాన్ని చూస్తూ ఉంటే మనసు పులకించక మానదు… ఓ సారి చూసిన తరువాత మరోమారు చూస్తే బాగుంటుందే అన్న భావన కూడా కలుగుతుంది. కథానాయికగా సాగుతున్న రోజుల్లోనే ఆమెకు బరువు ప్రధాన సమస్యగా మారింది. ఎన్నో అడ్డంకులను అతి సులువుగా అధిగమించిన సావిత్రి బరువుతోనే కథానాయిక పాత్రలకు దూరమయింది. అయినప్పటికీ సావిత్రికి తగ్గ పాత్రలు పరుగులు తీస్తూ ఆమె వైపుకే వెళ్ళాయి.

ఆ పాత్రల్లోనూ ఆమె ఆకట్టుకున్న తీరును ఎవరూ మరచిపోలేరు. సావిత్రి సూపర్ స్టార్ గా సాగుతున్న రోజుల్లో ఆమె అభినయాన్ని, స్టార్ డమ్ ను మరో మహానటి భానుమతితో పోల్చి చూసేవారు సినీజనం. ఆ సమయంలో భానుమతిలాగే తానూ దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు సావిత్రి. ‘చిన్నారి పాపలు, ప్రాప్తం, మాతృదేవత’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సావిత్రి. వాటిలో ఒకే ఒక్క ‘మాతృదేవత’నే విశేషాదరణ పొందింది. సావిత్రి దర్శకత్వం వహించిన చిత్రాలలో రెండు సినిమాలకు ఆమెనే ఫైనాన్స్ చేశారు. ఆ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. తరువాత ఆదాయపు పన్నుశాఖ వారి దాడి కూడా సావిత్రిని కుంగదీసింది. దాంతో మనస్తాపానికి గురయిన సావిత్రి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా, కొన్ని పాత్రలు మాత్రం ఆమె దరికే చేరి, జనం మదిలో చెరిగిపోని ముద్ర వేశాయి. తిరుగులేని తారాపథంలో పయనించిన సావిత్రి, అభిమానుల మదిలో మాత్రం ఓ దేవతలా నిలిచారు. ఆమె అభినయవైభవాన్ని తలచుకుంటూ ఈ నాటికీ ఎంతోమంది పులకించి పోతున్నారు. మరపురాని మహానటిని ఆమె నటనావైభవాన్ని తలచుకొనే కొద్దీ ఎవరైనా పులకించి పోవలసిందే. కాదని ఎవరనగలదరు? సావిత్రి అభినయానికి అంతటి శక్తి ఉంది. ఆ శక్తిని చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ‘మహానటి’ చిత్రం చూసిన తరువాత సావిత్రి గురించి తెలుసుకోవాలనీ నవతరం ప్రేక్షకులు పరితపిస్తున్నారు. మరి ఆమె జీవితకథలోని మరికొన్ని కోణాలు ఎప్పుడు వెలుగు చూస్తాయో చూడాలి. సావిత్రి నేడు మన మధ్య లేకపోయినా, ఆమె నటనావైభవం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సావిత్రి నటించిన చిత్రాలను చూస్తూ, ఆమె నటనాపటిమను చూసి మురిసిపోతూ, ఆ మహానటికి నివాళులు అర్పిద్దాం.

Related posts