telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాపై మూడు తప్పుడు కేసులు..మరోసారి హైకోర్టులో రవిప్రకాష్ పిటిషన్

Ravi-Prakash-TV9-

తనపై మూడు తప్పుడు కేసులు నమోదు చేశారని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దురుద్దేశంతోనే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు మూడు కేసులకు మూడు పిటిషన్లను దాఖలు చేశారు. ఫోర్జరీ అభియోగాలతో తనపై నమోదు చేసిన మూడు కేసులను కొట్టివేయాలని కోర్టును కోరారు. ఇందులో ప్రతివాదులుగ తెలంగాణ ప్రభుత్వం, అలందా మీడియాను చేర్చారు. హరియాణా వర్సెస్‌ భజన్‌లాల్‌ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనపై కేసు పెట్టారని రవిప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదని స్పష్టం చేశారు.

అంతేకాకుండా తాను పాతతేదీతో షేర్లను విక్రయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని మోపిన అభియోగాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఊహాజనిత ఆరోపణలతో పెట్టిన ఈ కేసులను కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు. అలందా మీడియా ఫిర్యాదు నేపథ్యంలో రవిప్రకాశ్ పై ఫోర్జరీ, కంపెనీ లోగోను చవకగా అమ్మేయడం, నకిలీ పత్రాల సృష్టి తదితర అభియోగాల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Related posts