telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణాలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు .. పోరాటానికి సిద్దమవుతున్న కార్మిక సంఘాలు..

Tsrtc increase salaries double duty employees

రాష్ట్రంలో ప్రగతి రథ చక్రానికి బ్రేకులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా తిష్ట వేసిన సమస్యలు పరిష్కరించక పోగా.. ఆర్టీసీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఓ పక్క నష్టాలు పెరిగి మోయలేని భారంగా మారిపోతుంటే మరోవైపు ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కనుచూపు మేరలో కూడా లాభాలు అర్జించే అవకాశం కనిపించడం లేదు. ఈ దిశగా చేసిన అనేక ప్రయోగాలు విఫలమయ్యాయి. మరోవైపు కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం పోరుకు సిద్ధమవుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు.. దినదిన గండంగా నెట్టుకొస్తున్న ఆర్టీసీలో సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే ఒకటి రెండు సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. త్వరలో మరో రెండు సంఘాలు కూడా సమ్మె నోటీసు ఇచ్చేందుకు అధికారులను కలిశాయి.

గతంలో ఒకసారి కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లేందుకు నోటీసులు ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కార్మికులు సమ్మె చేస్తే సంస్థను ఖచ్చితంగా మూసివేసి ప్రైవేటు పరం చేస్తామని హెచ్చరించారు. తాజాగా మరోసారి కార్మిక సంఘాలు ఒక్కొక్కటిగా సమ్మె నోటీసు ఇస్తుండటంతో ఈసారి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ ఉద్యోగ, కార్మికవర్గాలలో నెలకొంది. ఆర్టీసీలో ప్రధానంగా వినిపించే డిమాండ్‌ వేతన సవరణ. నాలుగేళ్ల క్రితం సిబ్బందికి ప్రభుత్వం భారీ వేతన సవరణను ప్రకటించింది. అనూహ్యంగా 44 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఒకేసారి ఆర్టీసీపై దాదాపు 850 కోట్ల వార్షిక భారం పడటం.. దానికి సరిపడా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీ కుదేలవుతూ వచ్చింది. ఇప్పుడు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంది టీఎస్‌ ఆర్టీసీ. నాటి వేతన సవరణ ఒప్పందం 2017తో ముగిసింది. తర్వాత ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ ప్రకటించకుండా 27 శాతం తాత్కాలిక భృతి ఇచ్చింది. రెండేళ్లు గడిచినా ఫిట్‌మెంట్‌ ఊసు లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ ఆందోళనకు దిగాయి కార్మిక సంఘాలు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts