telugu navyamedia
సినిమా వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నార్త్ కొరియానా ?… వర్మ వ్యాఖ్యలు

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల నిర్మించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాపై పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేయగా హిట్ టాక్ ఆంధ్రప్రదేశ్‌లో కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాయిదా వేశారు. చివరకు లైన్ క్లియర్ కావడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ. ఈ మేరకు ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే తీరా సమయానికి హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

దీంతో అలెర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపిన వర్మ.. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు” అని పేర్కొన్నారు.

ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతుంది, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఆదివారం అధికారులు తనకు ఇచ్చిన నోటీస్‌లో పేర్కొన్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. బలవంతంగా తనను విజయవాడ నుంచి పంపేయమని నోటీస్‌లో పేర్కొనలేదన్నారు. అసలు ఆ నోటీస్ ఎవరిచ్చారో కూడా తనకు తెలియదన్నారు. విజయవాడలో తనను ప్రెస్ మీట్ పెట్టుకో నివ్వకపోవడం దారుణమని వర్మ పేర్కొన్నారు. తానేదో టెర్రరిస్టుని అన్నట్టు ప్రవర్తించారన్నారు. విజయవాడలో ఉండటానికి కూడా అంగీకరించలేదని, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తనకు సెకండరీ అన్నారు. తనకు జరిగిన అవమానం షాక్‌కు గురిచేసిందని వర్మ పేర్కొన్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఇప్పటికే విడుదలైందని, తాను కొత్తగా మాట్లాడటానికి విజయవాడలో ఏముందని ప్రశ్నించారు. ఏం మాట్లాడతానని పోలీసులు భయపడుతున్నారని వర్మ నిలదీశారు. తనను అడ్డుకొమ్మని ఎవరు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలన్నారు. కనీసం నోటీసులో కూడా పేర్కొనలేదన్నారు. ఎయిర్‌పోర్టులోకి పోలీసులు ఎలా వచ్చారని వర్మ ప్రశ్నించారు. ప్రెస్‌మీట్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా తనకు లేదా? అని నిలదీశారు. తనను ఏపీకి రావొద్దని అంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ఏమైనా నార్త్‌ కొరియానా? అని ప్రశ్నించారు. వీసా తీసుకుని అక్కడ అడుగుపెట్టాలా? అని వర్మ ప్రశ్నించారు. 

Related posts