చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్త రాకేశ్ అరెస్ట్ పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… తనను, టీడీపీ నేత పులివర్తి నానిని విమర్శిస్తూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని తెలిపారు. వాటిని ఖండిస్తూ రాకేశ్ చౌదరి అనే టీడీపీ అభిమాని పోస్టులు పెట్టారని చెప్పారు. దీంతో, రాకేశ్ ను స్టేషన్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని తెలిపారు. ఇది చాలా దారుణమని అన్నారు.
సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా? టీడీపీ వాళ్లు పెడితే పోలీసులు బెదిరిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోస్టులు తొలగించనని చెప్పినందుకు రాకేశ్ పై కుట్ర చేశారని ఆరోపించారు. వేరే కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాకేశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశానని పేర్కొన్నారు.