telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

వంగవీటి రాధాకు టీడీపీ గాలం..ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్!

Vangaveeti Raadha Election compaign TDP
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం అధికార తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరి నచ్చక మరింతమంది పార్టీ వీడతారంటూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. వైసీపీ వీడిన వంగవీటి రాధాకృష్ణను టీడీపీ లోకి తీసుకెళ్లేందుకు సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. వైసీపీలో చోటు చేసుకొన్న పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం సాగుతోంది. 
 రాధాకృష్ణ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీలోని కీలక నేతలు రాధాతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పించి, అవసరాన్ని బట్టి మంత్రి పదవిని ఇచ్చేలా అంగీకరించినట్లు సమాచారం. టీడీపీ ఆఫర్ పై రాధా రెండు రోజుల గడువు కోరినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో బలమైన రాజకీయ నేత వంగవీటి రాధాకృష్ణకు విజయవాడలో ఆయనకు గట్టిపట్టుంది. అలాంటి వ్యక్తి గత కొంతకాలంగా రాజకీయాల్లో సతమతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన ఆయన ఆ తర్వాత వరుస ఓటమిపాలయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయి రాజకీయంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ద్వారా కొంత ఒడ్డున పడొచ్చని రాధా ఆలోచనతో ఉన్నారు. 
వంగవీటి రాధాను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా కోస్తా ప్రాంతంలో గణనీయంగా ఉన్న కాపు ఓట్లను తిప్పుకోవచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.   అలాగే కీలక నగరమైన విజయవాడలో పార్టీకి ఓ సామాజికవర్గంలో బలమైన పట్టు వస్తుందనే అంచనా కూడా వేస్తున్నారు.  జనసేన వైపు నుండి ఆహ్వానం రాలేదని, టీడీపీ నుండి పిలుపు వచ్చిందని రాధా అనుచరులు  స్పష్టం చేశారు. ఎందులో చేరాలి అనే అంశంపై ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదని రాధా అనుచరులు చెబుతున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధాకృష్ణ  2014 ఎన్నికల సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో  చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనవరి 24న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related posts