telugu navyamedia
క్రీడలు వార్తలు

రాజస్థాన్ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం…

రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ బారిన పడిన అతని తండ్రి కంజి భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇంటికి చేరిన సకారియా తన తండ్రి ని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. గుజరాత్‌కు చెందిన సకారియా తండ్రి కొన్నేళ్లుగా డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. టెంపో నడిపి ఇద్దరు కొడుకలను చదివించారు. అయితే ఈ ఏడాది జనవరిలో సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషాదం నుంచి కుటుంబం కోలుకోకముందే కరోనా అతని తండ్రిని బలి తీసుకుంది. కఠిన బయోబబుల్ కారణంగా సకారియా తన తమ్ముడి కడ చూపుకు కూడా నోచుకోలేదు. ఆ సమయంలో అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉండగా కుటుంబ సభ్యులు తమ్ముడి వార్తను తెలియకుండా దాచారు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ చేతన్ సకారియాను రూ. కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో అతను ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. పేద కుటుంబం నుంచి ఓ స్టార్ ప్లేయర్ ఎదిగిన అతని ప్రయాణం ప్రతీ ఒక్కరికి స్పూర్తిదాయకం. ఇక అతనిపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన చేతన్ సకారియా.. ఏడు వికెట్లు తీశాడు.

Related posts