telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై ద్రావిడ్ జోస్యం…

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ పై మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ జోస్యం చెప్పారు. 2007 తర్వాత ఇంగ్లిష్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కు ఇదే మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ గడ్డపై చివరిగా టీమిండియా 2007లో టెస్టు సిరీస్ గెలిచింది. అది కూడా ద్రవిడ్ కెప్టెన్సీలోనే కావడం విశేషం. జూన్ 2న ఇంగ్లండ్‌కి వెళ్లనున్న టీమిండియా.. అక్కడ ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడబోతోంది. భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్ గురించి తాజాగా ద్రావిడ్ మాట్లాడుతూ… ‘టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు మంచి అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ బౌలింగ్‌ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ముఖ్యంగా వాళ్ల సీమ్‌ బౌలింగ్‌ దాడి గొప్పగా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్‌లో చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్లో చూస్తే.. జో రూట్‌ రూపంలో టాప్‌-7లో ఒక్కడే ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌ ఉన్నాడు. బెన్ స్టోక్స్‌ కూడా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌. కానీ రవిచంద్రన్ అశ్విన్‌ ముందు అతని ఆటలు సాగే అవకాశం లేదు. వీళ్లిద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది’ అని అన్నారు. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. కాబట్టి ఇదే మనకు మంచి అవకాశం. బహుశా సిరీస్‌ 3-2తో కోహ్లీసేన సొంతమవుతుందని భావిస్తున్నా’ అని ద్రవిడ్ పేర్కొన్నారు.

Related posts