telugu navyamedia
తెలుగు కవిత్వం రాజకీయ

నేడు విశ్వ క‌వి వ‌ర్ధంతి..!

నోబెల్ అవార్డు గ్ర‌హీత, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వ‌ కవి, రవీంద్రనాథ్ ఠాగూర్ . స్వాతంత్ర యుద్దంలో కొంద‌రు క‌త్తుల‌తో పోరాడితే ఈయన క‌లంతో క‌దం తొక్కారు. స్వేచ్చా స్వ‌ర్గంలోకి నా దేశాన్ని న‌డిపించ‌మ‌ని వెలిగెత్తి చాటారు. గొప్ప ర‌చ‌య‌త‌గా, సంగీత కారుడుగా, చిత్ర‌కారుడుగా, విద్య వేత్త‌గా అన్నింటికి మించి గొప్ప మాన‌వ‌తా వాదిగా నిలిచారు. వారే మ‌న రవీంద్రనాథ్ ఠాగూర్.

క‌ల‌క‌త్తా మ‌హాన‌గ‌రంలోని బ్రహ్మ‌ణ కుటుంబంలో దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు 14వ‌ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ర‌వీంద్రుడు కుటుంబం జ‌మీందార్‌లు కావ‌డంతో అంద‌రూ ఠాగూర్ పిలుస్తారు. అత‌ని త‌ల్లి చిన్న‌తనంలోనే చ‌నిపోయింది.

ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా క‌నిపించేది.

రవీంద్రుడు పాఠశాలలో చదవడానికి ఇష్టపడక ఇంటివద్దనే క్రమశిక్షణతో ప్రతి ఉదయం వ్యాయామం చేసి, లెక్కలు చేసి, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు అభ్యసించేవాడు. ఆదివారాలలో సంగీత పాఠాలు, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం నేర్చుకొనేవాడు. బొమ్మలున్న ఆంగ్ల నవలలను స్వయంగా చదివేవాడు. కాళిదాసు, షేక్స్‌పియర్ రచనలు చదివాడు. భాషను క్షుణ్ణంగా అభ్యసించి మాతృభాష పట్ల అభిమానం పెంచుకొన్నాడు.

రవీంద్రుడు ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పొంచుకొన్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా ఆకళించుకొన్నాడు. తన అనుభవాలను భారతికి లేఖలుగా వ్రాసేవాడు. రవీంద్రుడు ఇంగ్లండులో వుండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. అయితే ఇంగ్లండులో పద్దెనిమిది మాసాలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఆ తర్వాత 1883 డిసెంబరు 9 న మృణాలిని దేవీని వివాహమాడాడు.

బెంగాల్ విభజన ప్రతిఘటనోద్యమంలో రవీంద్రుడు ప్రముఖపాత్ర వహించాడు. జాతీయ నిధికి విరాళాలు వసూలు చేశాడు. రవీంద్రనాథ టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు.

రవీంద్రుడు వ్రాసిన “జనగణమణ” ను జాతీయ గీతంగా ప్రకటించేముందు “వందేమాతరం”, “జనగణమన” లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. అంతిమంగా రవీంద్రుడి “జనగణమన” దే పైచేయి అయింది. దీంతో రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించాడు. అదే సమయంలో రెండూ సమాన ప్రతిపత్తి కలిగి ఉంటాయని స్పష్టం చేసాడు.

1941 వ‌చ్చే స‌రికి ర‌వీంద్రుడు ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఆ స‌మ‌యంలో ర‌వీంద్రుడు ఒక సందేశాన్నిపంపారంట‌. నేను చ‌నిపోతున్నాన‌ని, నా మిత్రుల వెచ్చ‌ని స్ప‌ర్శ‌, ఈ పుడిమి త‌ల్లి శాశ్వ‌త ప్రేమ కావాల‌ని చెప్పారంట‌.

తీవ్రమైన ఆనారోగ్యం తో బాధపడుతూ, చికిత్సకై కలకత్తా నగరానికి వెళ్లాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, 1941 ఆగష్టు 7న క‌న్నుముశారు.

Related posts