telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీచర్లకు ఆపత్కాల సహాయాన్ని కొనసాగించాలి : ట్రస్మా

హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం మరియు ఇతర సభ్యులు కలిసి ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన ఆపత్కాల సహాయాన్ని విడుదల చేయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బంది ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి ప్రతి నెల 2000 రూపాయలు మరియు 25 కిలోల బియ్యాన్ని ప్రత్యేక సహాయంగా అందించడం జరిగిందని , ఇది లక్షలాది మంది ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బందిని ఆర్థిక కష్టాల నుండి కొంతమేర కాపాడకలిగిందని శేఖర్ రావు అన్నారు.

అయితే జూలై నెల నుండి ఇవ్వవలసిన 2000 మరియు బియ్యం ఇంకా అందని కారణoగా ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఆర్థిక మరియు మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే జూలై మరియు ఆగస్టు నెల కోటాను విడుదల చేయించడంతో పాటు విద్యా సంస్థలు భౌతికంగా (ప్రత్యేక్ష బోధన) తిరిగి తెరుచుకునేంతవరకు ఈ సహాయాన్ని ప్రతినెలా అందించాలని కోరారు. సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్న హరీష్ రావు గారు సానుకూలంగా స్పందించి సీఎం గారి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి వెంటనే ఆర్థిక సహాయం విడుదల అయ్యే విధంగా చూస్తానని ట్రస్మా నాయకులకు హామీ ఇచ్చారు. కరీంనగర్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరం సంజీవ రెడ్డి,సామ ప్రతాపరెడ్డి, రాష్ట్ర భాద్యులు తదితరులు ఈ సందర్భంగా హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts