telugu navyamedia
రాజకీయ

కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగ్వంత్ మాన్..

పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు .బుధవారం రాత్రి ఢిల్లీలోని ‘అపోలో’ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఇన్ఫెక్షన్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన చికిత్సను అందించారు. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ఏడాది జరిగిన పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ సంచలన విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. మార్చి 16న పంజాబ్​ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్​ మాన్ ప్రమాణస్వీకారం చేశారు​. 117 స్థానాలున్న శాసనసభలో.. ఆప్​ 92 చోట్ల గెలిచి సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది.

కాగా..జులై 7న మాన్​ నిరాడంబరంగా.. రెండో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్​ప్రీత్ కౌర్​ను సీఎం మాన్ వివాహమాడారు. చండీగఢ్​లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

మ‌రోవైపు బుధవారం సిద్దూ మూసేవాలా హంతకులను విజయవంతంగా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు బలగాలను సీఎం భగ్వంత్ మాన్ అభినందించారు. ఆపరేషన్‌ను అనుకున్నట్టు పూర్తిచేశారని మెచ్చుకున్నారు.  పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్లను జగ్‌రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు.

వీరి నుంచి 1 ఏకే 47, 1 పిస్టోల్‌ను రికవరీ చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో సంఘ వ్యతిరేక శక్తులపై నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించామని ఈ సందర్భంగా పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

Related posts