telugu navyamedia
రాజకీయ

రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌లు : విప‌క్షాల రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా య‌శ్వంత్ సిన్హా

*విప‌క్షాల రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా య‌శ్వంత్ సిన్హా
*అధికారికంగా ప్ర‌క‌టించిన జైరాం ర‌మేష్‌
*య‌శ్వంత్ సిన్హాకు22 పార్టీలు మ‌ద్ద‌తు
*వాజ్‌పేయ్ కాబినేట్‌లో కేంద్ర మంత్రిగా య‌శ్వంత్ సిన్హా ప‌నిచేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఆయ‌న పేరు ను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అధికారికంగా ప్రకటించారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ సిన్హా, పేరును ఏక‌గ్రీవంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. యశ్వంత్‌ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సముఖంగానే ఉన్నారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తూ ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు.

టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు నేను కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుండి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్‌ చేశారు.. ఆమె నా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు ఆయన.

దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ కాబినేట్‌లో కేంద్ర మంత్రిగా య‌శ్వంత్ సిన్హా ప‌నిచేశారు. ఆయ‌న రాజ‌కీయాల‌కు రాక‌ముందు ఐఏఎస్ అధికారిగా సేవ‌లందించారు.

1984లో రాజకీయాల్లోకి వచ్చారు.  1988లో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1989లో జనతాదళ్‌లో చేరి, 1990 నుంచి 1991 వరకు దివంగత ప్రధాని చంద్రశేఖర్‌ స్వల్పకాల పరిపాలనలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1992లో తన రాజకీయ అనుబంధాన్ని బీజేపీకి మార్చుకున్నారు.

 దాదాపు రెండున్నర దశాబ్దాలకుపైగా బీజేపీలో అత్యున్నత వ్యక్తులలో ఒకరిగా ఉన్న తర్వాత.. ఎన్డీయే ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని ఆరోపిస్తూ 2018లో సిన్హా బీజేపీ నుంచి వైదొలిగారు. బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటానని ప్రకటించారు.

మార్చి 2021లో పశ్చిమ బెంగాల్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరారు.  జాతీయ‌రాజ‌కీయాల్లో సుదీర్ఘ అనుభం ఉన్న వ్య‌క్తి సిన్హా.

రాష్ట్రపతి అభ్యర్థికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పేరును మమతా బెనర్జీనే ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపాలంటే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, వామపక్షాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు.

 

Related posts