*ఏ మొహం పెట్టుకుని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారో చెప్పాలి..
*తెలంగాణకు ఏం తెచ్చారని ..ఏం ఇచ్చారని వస్తున్నారు..
*కూకట్పల్లి నియోజకవర్గం కైత్లాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభం
*తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి..
*దేశాన్ని రామరాజ్యం చేస్తామని చేప్పి..రావణకాష్టం చేశారు
ప్రధాని నరేంద్ర మోదీ ఏ మొహం పెట్టుకుని మోదీ హైదరాబాద్‌కు ఎందుకు వస్తారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎక్కడకు వెళ్లినా వేల కోట్ల రూపాయల పనులు శంకుస్థాపన చేశారని చెప్తారు. అందులో ఎంత నిజముందో తెలియదు.
బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్ వస్తారు అని అంటున్నారు. హైదరాబాద్‌కు టూరిస్టులు వస్తారు పోతారు. మన కేసీఆర్ ఇక్కడే ఉంటారు. వచ్చే టూరిస్టులు ఏం తెచ్చారో ఏం ఇచ్చారో చెప్పాలని’ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
మంగళవారం హైదరాబాద్‌లో కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు . కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో హైటెక్ సిటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్‌లో 8ఏళ్లలో తెరాస ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరో 17 ఫ్లైఓవర్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.
హైదరాబాద్ జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. ఐడీపీఎల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా భూములిచ్చింది. ఐడీపీఎల్ విషయంలో కేసులు వేయండి..ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారని హైదరాబాద్‌కు చెందిన ఒక కేంద్రమంత్రి అంటున్నారు.
కేంద్ర మంత్రిగా మీరు కొత్తగా పైసా పని చేయరు.. మేము పని చేస్తుంటే కేసులు పెట్టమని ఆదేశాలు ఇస్తున్నారట. మీకు దమ్ముంటే.. మున్సిపల్ మంత్రినైన నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి. ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికులపై కేసులు వేయవద్దని కోరుతున్నా అన్నారు. .మీకు చేతనైతే రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం మని సవాల్ విసిరారు.
దేశాన్ని రామరాజ్యం చేస్తామని చేప్పి.. బీజేపీ ప్రభుత్వం రావణకాష్టంలా మారుస్తుందని ఆరోపించారు. అగ్నిపథ్ స్కీమ్ తెచ్చి దేశంలోని యువత పొట్టకొడుతున్నారని విమర్శించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని దేశద్రోహులని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్ పథకం మంచిదని చెబుతున్నాడు. అగ్నిపథ్ పథకంలో చేరిన తర్వాత బట్టలు ఉతకొచ్చు. కటింగ్ చేయొచ్చు, ఎలక్ట్రిషియన్ పని చేయొచ్చు.. బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్ అంటున్నాడు. దాని కోసం కోసం దేశ యువత మిలటరీలో చేరాలా?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. యువత రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే కేంద్రం అది పట్టించుకునే మూడ్‌లో లేదని విమర్శించారు.