telugu navyamedia
ఆంధ్ర వార్తలు

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసు : ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ మరోసారి నోటీసులు

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గ‌తంలో న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ ఆమంచికి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. . ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద నోటిసు జారీచేసింది.

గతేడాది ఆరంభంలో వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే కొందరు జడ్జీలు పనిగా పెట్టుకున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలంటూ తీవ్ర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు.

దీనిపై ఫిర్యాదులు అందడంతో ఇలా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపరుస్తూ, జడ్జిలను బెదిరించేలా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదయ్యాయి.

ఈ విషయమై గత ఏడాది నవంబర్ మాసంలో 16 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను యథాతథంగా నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది. ఐటీ సెక్షన్లలోని 154, 504, 505 సెక్షన్ల ప్రకారంగా సీఐడీ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ ను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ప్రకటించింది.

వైసీపీ నేతలు న్యాయవ్యవస్థను కించపర్చేలా విమర్శలు చేశారని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర పోలీసుల విచారణ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు ఆమంచి కృష్ణ మోహన్ హాజరైన విషయం తెలిసిందే. మరోసారి ఆమంచిని ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నెల 22న హాజరుకావాలని సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.

Related posts