telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ , ‘డుంబు’ సృష్టికర్త బుజ్జాయి ఇక లేరు!

ప్రముఖ రచయత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు, ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) చెన్నై లో గురువారం రాత్రి కన్నుమూశారు. సెప్టెంబరు 11, 1931లో జన్మించిన ఆయన తండ్రి చేయి పట్టుకుని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు తప్పితే ఏ రోజునా పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించింది లేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు.

17 సంవత్సరాల వయసులో బుజ్జాయి పేరుతో ‘బానిస పిల్ల’ బొమ్మల పుస్తకం ప్రచురించి ‘కామిక్‌ స్ట్రిప్‌’ పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. ‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైనది. ఇది 1975లో వచ్చింది. పలు భారతీయ భాషల్లో 42కు పైగా బొమ్మల కథలు వివిధ పత్రికలలో సంవత్సరాల పాటు సీరియల్ గా వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో 15 కార్టూన్ కథల పుస్తకాలను వెలువరించారు. ఆంగ్లంలోనూ సీజన్స్ పబ్లికేషన్స్, దేవమాల ప్రచురణ సంస్థలు ఆయన బొమ్మల కథలను పుస్తకాలుగా తీసుకొచ్చాయి. శ్రీ బుజ్జాయి 2010లో ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రచించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు ‘దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి’ అని పెట్టుకున్నారు. కుమారుడు కూడా రచయిత. బుజ్జాయి కుమార్తె రేఖా సుప్రియ సీనియర్ సినీనటుడు నరేష్ మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ. బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్‌ కూడా తెలుగు రచయిత్రి!
బుజ్జాయి గారికి నివాళి .

Related posts