telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మైండ్ గేమ్ ఆడుతున్నారు.. పావులు కావొద్దు -పొత్తుల‌పై ప‌వ‌న్ క్లార‌టీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పొత్తులపై జ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పొత్తుల విషయంలో వేర్వేరు పార్టీలు ఆడే మైండ్ గేమ్ లో పావులు కావొద్దని ఈ సందర్భంగా పవన్ పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు.

ఇటీవ‌ల‌ కుప్పం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌నసేన‌తో పొత్తుల విష‌య‌మై టీడీపీ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ.. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశంపై జ‌న‌సేత అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిసారి స్పందించారు.

పొత్తుల‌పై ఒక్కడినే నిర్ణ‌యం తీసుకోన‌ని తేల్చి చెప్పిన జ‌న‌సేనాని అంద‌రితో చ‌ర్చించాకే నిర్ణ‌యం తీసుకుంటాన‌ని తెలిపారు. అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.

What is the impact of Pawan Kalyan on Andhra politics? - Quora

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని, ర‌క‌ర‌కాల పార్టీలు మ‌న‌తో పొత్తు కొరుకోవ‌చ్చు. దానిని మైండ్ గేమ్ అన‌నివ్వండి ఏ పేరైనా స‌రే.. మ‌నం మాత్రం అంద‌రం ఒకే మాట మాట్లాడుదామ‌ని చెప్పుకొచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలని సూచించారు.

కరోనా కారణంగా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించలేకపోయామని.. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ రోజురోజుకు బలం పుంజుకుంటోందన్నారు. ఏపీలో ఏ మూలకెళ్లినా జనసేన జెండా రెపరెపలాడుతోందని పవన్ పేర్కొన్నారు. జనసేనను స్థాపించే సమయంలో పార్టీతో ఉన్న యువకులే నేడు నాయకులుగా ఎదిగారని చెప్పారు.

పార్టీ నిర్మాణం అనేది కష్టమైనదని అన్నారు. సంస్థాగత నిర్మాణం లేదని చెబుతున్నవారు.. ఎవరూ పార్టీని స్థాపించలేదని అన్నారు. చిన్నపాటి సంస్థను నడిపించలేని వ్యక్తులే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన విషయమని చెప్పారు. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామంటే సామాన్య విషయం కాదని తెలిపారు.

జ‌న‌సేన ఆవిర్భావ నిర్వహణ సభ..

గత సంవత్సరం కోవిడ్ పరిస్థితుల వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోలేకపోయాం. ఈ సారి మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తామని పవన్ తెలిపారు. ఇప్పటికే 400 మండలాల్లో పార్టీ కమిటీలు వేసుకున్నామని ప‌వ‌న్ వెల్ల‌డించారు.

Related posts