telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్​పై దాడి..

బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. గోదావరి ముంపు గ్రామమైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని గ్రామస్తులతో పాటు టీఆర్ ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ ఎస్‌కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది..

ఎన్నికల సమయంలో ఎంపీగా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానన్న హామీ, గ్రామంలో ఉన్న మల్లన్న గుట్ట సమస్య పరిష్కరిస్తానన్న హామీ ఏమైందని గ్రామస్థులు నిలదీసారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాల అద్దాలు పగలగొట్టారు.

మరోవైపు ధర్మపురి అర్వింద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఎర్దండిలో జరిగిన దాడిపై అమిత్ షా ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షా‌కు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు చెప్పారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరపాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఆదేశాలను ఇచ్చిందని అర్వింద్ ఆరోపించారు. దాడి వెనక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు

Related posts