telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిత్యానంద .. పరార్.. దేశం దాటేయటం అంత సులభమా.. !

nityananda escaped from india

ఆధ్యాత్మిక గురువు గా చెప్పుకుంటున్న నిత్యానంద దేశం దాటి పారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి అతడు పారిపోవడం గమనార్హం. నిత్యానందపై కర్ణాటక రాష్ట్రంలో అత్యాచారం కేసు, గుజరాత్ రాష్ట్రంలో కిడ్నాప్, వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిత్యాంద సుమారు 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద నేపాల్ మీదుగా ఈక్వెడార్ దేశానికి పారిపోయినట్లు సమాచారం. నిత్యానంద పాస్‌పోర్ట్ సెప్టెంబర్ 2018లోనే గడువు తీరిపోవడం గమనార్హం. అప్పట్నుంచి అతడు పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకోలేదని రామనగర మాజీ ఎస్పీ మీడియాకు తెలిపారు. సాధారణంగా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల పాస్ పోర్టులను తాము రెన్యూవల్ చేసేందుకు నిరాకరిస్తామని, అందుకే ఆయన రెన్యూవల్ చేసుకోలేదేమోనని అన్నారు. సెప్టెంబర్ 30, 2018లోనే నిత్యానంద పాస్ పోర్ట్ గడువు తీరిపోయిందని, అప్పట్నుంచి అతడు దాన్ని రెన్యూవల్ చేసుకోలేదని చెప్పారు.

అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారి మాట్లాడుతూ.. కర్ణాటకలో అత్యాచారం కేసు నమోదైన తర్వాత నిత్యానంద దేశం వదిలిపారిపోయాడని తెలిపారు. అతడి కోసం గుజరాత్‌ రాష్ట్రంలో వెతకడం వృథా అని అన్నారు. గుజరాత్ పోలీసులు సరైన రీతిలో అతడ్ని కస్టడీకి తీసుకోవాల్సి ఉందన్నారు. అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో నిత్యానంద విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. అహ్మదాబాద్‌లోని ఆశ్రమం వ్యవహారాలకు సంబంధించి నిత్యానందపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు నిత్యానంద శిశ్యులను అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. యోగిని సర్వగ్యపీఠంను నడిపించేందుకు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారనే ఆరోపణలు నిత్యానందపై ఉన్నాయి. మంగళవారం ఆశ్రమానికి చెందిన ఇద్దరు సాధ్వీలు ప్రాణ్‌ప్రియ, ప్రియతత్వలను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, వేధింపులు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నేరాల కింద వారిని అదుపులోకి తీసుకుని, ఐదురోజులపాటు రిమాండ్‌కు తరలించారు. 9-10ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు వీరిద్దరిపై ఆరోపణలున్నాయి. మరో ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడి వారిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

ఈ ఘటనతో ఎవరైనా దేశం దాటేయటం చాలా సులభమని, ఇదే తరహాలో ఆర్థిక నేరస్తులు చక్కగా తప్పించుకున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లం అవుతుంది. బహుశా ప్రభుత్వం నిఘావర్గాల సంఖ్యను ఇంకాస్త పెంచుకుంటే, ఇలాంటివి జరిగిపోయాక కాకుండా కనీసం జరిగేటప్పుడు చర్యలు తీసుకోని.. దోషులు పారిపోకుండా పట్టుకోవచ్చు. చూద్దాం మోడీ ప్రభుత్వం ఏమాత్రం విజయం సాధిస్తుందో అని!!

Related posts